టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చూపు మంద‌గించింద‌ని ఏపీ మున్సిప‌ల్, పట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఏపీ సీఎం జ‌గ‌న్ నాలుగు నెల‌లుగా ఎంతో ఆద‌ర్శంగా ప‌రిపాల‌న చేస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఓ మ‌హిళా ఎంపీడీఓను దూషించార‌ని ఆమె కేసు పెడితే వెంట‌నే పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన విష‌యం చంద్ర‌బాబు గ‌మ‌నించాల‌ని అన్నారు.


మ‌రి టీడీపీ పాల‌న‌లో దెంద‌లూరు ఎమ్మెల్యేగా, విప్‌గా ప‌నిచేసిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఓ మ‌హిళా ఎమ్మార్వోపై దాడిచేస్తే ఎన్నికేసులు పెట్టారో, ఎమ్మార్వోకు ఏమీ న్యాయం చేశారో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు బొత్స‌. ఇక గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను, కంటివెలుగు ప‌థ‌కాల‌ను తామే తీసుకుచ్చామ‌ని చంద్ర‌బాబు అబ‌ద్దాలు ఆడ‌టం చూస్తుంటే ఆయ‌న‌కు కంటిచూపు మంద‌గించింద‌ని, అవ‌స‌ర‌మైతే చంద్ర‌బాబు వెంట‌నే సీఎం ఇటీల‌వ ప్రారంభించిన వైఎస్సార్ కంటివెలుగు ప‌థ‌కంలో కంటి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు.


చంద్రబాబుకు చేత‌కాకుంటే మేమే ద‌గ్గ‌రుండి చూపిస్తామ‌ని బొత్స అన్నారు. అమ‌రావ‌తిలో నిర్మించాల‌నుకున్న స‌చివాలయం చూసి గ్రామ స‌చివాలయం అనుకుంటున్నారెమోన‌ని ఇక‌నైనా త‌న హుందాత‌నాన్ని కాపాడుకోవాల‌ని లేకుంటే జ‌నంలో ఆయ‌నకు ఉన్న ప‌రువు కాస్త బ‌జారున ప‌డుతుందని హెచ్చ‌రించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబులా అనవసరమైన మాటలు చెప్పడం రాదని.. ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారని అన్నారు. కాల్‌మనీ కేసులో అభియోగాలు వచ్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.  విశాఖ పార్టీ మీటింగ్‌లో కరెంట్‌ పోయిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


చంద్రబాబు స్థాయి మరచి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయం కంటే.. గత ఐదేళ్లలో టీడీపీ దోపిడీ వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసి దివాళా తీయించింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. విశాఖలో భూ రికార్డులను తారుమారు చేసింది టీడీపీ నాయకులు కాదా అని బొత్స ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.


విశాఖలో భూ కుంభకోణం జరిగిందని.. అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్నట్టు తెలిపారు. చంద్ర‌బాబులాగా సీఎం జ‌గ‌న్‌కు మాట‌లు చెప్ప‌డం రాద‌ని, కేవ‌లం చేత‌ల‌ల్లో త‌న ప‌నిత‌నం చూపుతార‌ని అన్నారు. ఇక‌నైనా చంద్ర‌బాబు త‌ప్పుడు మాట‌లు మాట్లాడటం మానుకుని త‌న ప‌రువును కాపాడుకోవాల‌ని బొత్స హితులు ప‌లికారు.



మరింత సమాచారం తెలుసుకోండి: