టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం తర్వాత..రాజకీయాల్లో కోడెల కుటుంబం ప్రస్థానం ముగిసిపోయినట్లే కనిపిస్తుంది. ఆయన తర్వాత కుటుంబంలో లీడ్ చేసే నాయకుడే కనిపించడం లేదు. వరుసగా అయిదుసార్లు నరసారావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల...2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. మొన్న ఎన్నికల్లో మళ్ళీ సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే కోడెలకు నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టుంది.


కానీ కోడెల మరణం తర్వాత రెండు నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం నుంచి పని చేసే నాయకుడు కనపడటం లేదు. కోడెల తనయుడు శివ రామప్రసాద్ గానీ, తనయురాలు విజయలక్ష్మి గానీ పార్టీ వైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా వారు పలు కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. అటు అధినేత చంద్రబాబు కూడా కోడెల కుటుంబాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు.


ఒకవేళ కోడెల వారుసుడుగా శివరాం కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, కేడర్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచే రెండు నియోజకవర్గాల్లో కోడెల ఫ్యామిలీపై తీవ్ర వ్యతిరేకిత వచ్చేసింది. ఈ తరుణంలో బాబు కోడెల ఫ్యామిలీకి పగ్గాలు అప్పగించడం కష్టం. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు నుంచే సత్తెనపల్లిపై కన్నేసిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు, ఎప్పటి నుంచో నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కోడెల మరణంతో నియోజకవర్గంలో పని చేయాలని చూస్తున్నారు.


అటు నరసారావుపేటలో మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన చదలవాడ అరవింద్...నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఈ రెండు చోట్ల కోడెల ఫ్యామిలీకి అవకాశం దక్కదు. బాబు కూడా కోడెల ఫ్యామిలీ మీద ఇంటరెస్ట్ చూపించడం లేదు. మొత్తానికి నాలుగు దశాబ్దాల పాటు పల్నాడులో రాజకీయాలు చేసి తనదైన ముద్రవేసిన కోడెల కుటుంబం చరిత్ర ఇంతటితో ముగిసినట్లే అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: