తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చమని అడిగిన పాపానికి 48 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆమె ఖండించారు.

 

ఆ ఉద్యోగులను విధుల నుంచి తొలగించలేదని... వాళ్లకు వాళ్లే సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్‌ వితండవాదం చేస్తున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేవలం తన మాట వినలేదనే నెపంతో... కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తామని తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చమని ఉద్యోగులు అడిగినందుకు 48 వేల మంది ప్రభుత్వం వేటువేసిన కేసీఆర్‌ నిరంకుశుడేనని ఆరోపించారు. కొద్ది రోజుల్లో జరగబోయే హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాలేదని అడిగితే... వారిని గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి వెనుకాడరనే అనుమానాన్ని విజయశాంతి వ్యక్తం చేశారు.

 

ఒకవేళ ఎవరైనా తమ ఓటు గల్లంతయ్యాయి అని అడిగితే... తాము ఎవరి ఓట్లూ తొలగించలేదని... వాళ్లకు వాళ్లే సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నారని కేసీఆర్‌ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని చెప్పిన సీపీఐ... ఎన్నికలు జరగడానికి ముందే అధికారపార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచిస్తామని ప్రకటించడం కేసీఆర్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విజయశాంతి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: