మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిపి తీరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించదు. సమ్మె చేస్తున్నవారితో చర్చలు కూడా జరుపరాదని తేల్చి చెప్పారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు.


సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్‌ మాసం జీతాలు చెల్లించాలని ఆదేశించారు. స‌మ్మెలో కొంద‌రు నాయ‌కులు ఏక‌పక్ష నిర్ణ‌యాల‌తో కార్మికుల‌కు ఇబ్బందులు పెడుతున్నార‌ని, స‌మ్మెలో పాల్గొంటున్న కార్మికుల‌కు ఎట్టి ప‌రిస్ఠితుల్లో వేత‌నాలు ఇవ్వ‌రాద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌స‌రా సెల‌వులు ఇచ్చిన విద్యా సంస్థ‌ల‌కు బ‌స్సులు బంద్ అయిన నేప‌థ్యంలో ఈనెల 19 వ‌ర‌కు సెల‌వుల‌ను పొడిగిస్తున్న‌ట్లు విద్యాశాఖ‌ను ఆదేశించారు.


ఇకముందు విద్యార్థులు న‌ష్ట‌పోకుండా రెండో శనివారం కూడా ప‌నిచేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  ఇక ఆర్టీసీ స‌మ్మె చేస్తున్న కార్మికులతో ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌రిపేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌మ్మె సంద‌ర్భంగా ర‌వాణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అందుకు అధికారులు ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లు చేయాల‌ని, ప్రైవేటు బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని, అందుకు వెంట‌నే నోటిఫికేషన్ ఇవ్వాల‌ని అధికారుల‌ను కేసీఆర్ ఆదేశించారు.


ఇక ఇప్ప‌టికే ఆర్టీసీ జేఏసీ, ఆఖిల ప‌క్షం నేత‌లు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలపై ప‌ర్య‌వసానాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.. మరోవైపు ఆర్టీసీ కార్మికులు... ప్రభుత్వం బెదిరింపులను పట్టించుకోకుండా తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 13న వంటావార్పు, 14న డిపోల ముందు భైఠాయింపు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న ధూందాం, 18న బైక్‌ ర్యాలీలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: