తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉదృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదన్నారు కేసీఆర్.


ఆయన ఏమంటున్నారంటే..

” బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బడ్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గుండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అంటున్నారు కేసీఆర్.


అంతే కాదు.. సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిపి మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ‘‘ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టండి. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండి. నిఘా పోలీసులనూ ఉపయోగించండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి,కోర్టుకు పంపాలి. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు’’ అని డిజిపిని సిఎం ఆదేశించారు.


అయితే కేసీఆర్ కేసుల వ్యూహం ఎంతవరకూ పనిచేస్తుందన్నది ఆలోచించాల్సిన విషయం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. రోజూ ఏదో ఒక ఆందోళనతో వాతావరణాన్ని అట్టుడికిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పంతానికి పోయి కేసులు పెట్టించడం పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. చూడాలి కేసీఆర్ వ్యూహం ఎలాంటి ఫలితం ఇస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: