రాజ‌కీయాల్లో ఎన్ని వ్యూహాలైనా ఉండొచ్చు. కానీ, అయిన వారిని, అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ను ఆదుకున్న వారిని మాత్రం ప‌క్క‌న పెడితే.. తీవ్ర‌ప‌రిణామాలు ఎదురు కాక త‌ప్ప‌దు. ముఖ్యంగా అయిన వారికి ఆకుల్లోనూ, కానివారికి కంచాల్లానూ వ‌డ్డిస్తున్నార‌నే నానుడిని గ‌తంలోటీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు రుజువు చేసుకుని తీవ్రంగా దెబ్బ‌తిన్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కూడా ఇదే ధోర‌ణిని ఫాలో అవుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌స్తున్న సందేహం అయితే ఫ‌ర్వాలేదు. కానీ, పార్టీనే న‌మ్ముకుని, పార్టీ కోసం త్యాగాలు చేసి, జ‌గ‌న్ జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీ కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్టించిన నేత‌లు కూడా ఇదే త‌ర‌హా చ‌ర్చ‌లు చేస్తుండ‌డం ఇప్పుడు ఆలోచ‌న‌కు దారితీస్తోంది.


రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. అలా అని.. ఎప్పుడు ఎలాంటి వ్యూహం వేయాలో కూడా తెలియ‌కుండా ముందుకు సాగుతూ.. గ‌తంలో నానా మాట‌లు అన్న‌వారిని, పార్టీలో టికెట్లు ఇచ్చి, డ‌బ్బులు ఇచ్చి.. పోటీచేయించిన వారు ఓడిపోయి.. ప‌క్క‌పార్టీల్లోకి వెళ్లి ప‌ద‌వులు అనుభ‌వించిన వారిని.. ఇప్పుడు త‌గుదున‌మ్మా! అని వ‌స్తే.. అక్కున చేర్చుకుంటున్న జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై పార్టీలో సీనియ‌ర్లు, జ‌గ‌న్ మాట కోసం టికెట్ల‌ను వ‌దులుకున్న నాయ‌కుల‌కు ఆగ్ర‌హం వ‌స్తోందంటే అతిశ‌యోక్తి ఏముంటుంది?! అన్నా మేమున్నాం!! అంటూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ కు భ‌రోసా ఇచ్చిన నాయ‌కులు ఇప్పుడు వేళ్ల‌పై లెక్కించ‌ద‌గిన స్థాయిలోనే గుర్తింపున‌కు నోచుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.


ఎక్క‌డెక్క‌డో తిరిగి.. అక్క‌డ కూడా పార్టీల్లో ప‌ద‌వులు వెల‌గ‌బెట్టి.. ఇప్పుడు వైసీపీలోకి వ‌చ్చి ప‌ద‌వులు సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలోనే ఉండి, జ‌గ‌న్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాయ‌కుల‌కు గుర్తింపు అంతంత మాత్రంగా ఉండ‌డంతో వీరు ర‌గిలి పోతున్నారు. ``మీ పార్టీ మీ యిష్టం.. కానీ, మ‌మ్మ‌ల్ని కూడా గుర్తించాలి క‌దా!``- అని వారు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న వారి ద‌గ్గ‌ర చెప్పుకొస్తున్నారంటే.. అసంతృప్తి ర‌గులుతున్న‌ద‌నే సంకేతాలు ఇంత‌క‌న్నా ఏం కావాలి?  గ‌తంలోనూ చంద్ర‌బాబు ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హారం న‌డిపారు. అధికారంలో ఉన్నాం క‌దా.. మ‌న ద‌గ్గ‌ర ఎవ‌రూ నోరు విప్ప‌లేరు క‌దా? అనుకున్నారు.


ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి జంపింగుల‌ను ప్రోత్స‌హించి, వారికి మంత్రి ప‌ద‌వులు స‌హా అనేక నామినేటెడ్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు. ఫ‌లితంగా అయిన‌వారు ఆయ‌న‌కు కాకుండా పోయారు. ఇప్పుడు క‌ష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకునేందుకు సంస్థాగ‌తంగా పార్టీకి సేవ చేసిన వారే దిక్క‌వ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప‌ద‌వులు పొందిన వారు పార్టీ ఓట‌మితో ప‌క్క‌కు జారిపోతే.. పార్టీ కోసం సేవ చేసిన వారిని బాబు ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇటు వీరిని, అటు వారిని కూడా బ‌తిమాలుకోలేక చంద్ర‌బాబు అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క టైపులో న‌లిగిపోతూ.. పార్టీని నిల‌బెట్టుకొనేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.


జ‌గ‌న్ పార్టీని ఇంత దుర్భ‌ల‌మైన ప‌రిస్థితి ఆవ‌హిస్తుంద‌ని చెప్ప‌క‌పోయినా.. అసంతృప్తులు పెరిగితే.. జంపింగుల‌కు అంద‌లాలు ద‌క్కితే.. రేపు వారు క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్‌కు ఎంత‌మేర‌కు ఆస‌రాగా నిలుస్తారనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఈ విష‌యాన్ని గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వైసీపీలోని మేధావుల‌కు, కీల‌క నేత‌ల‌కు కూడా ఉంది.  పార్టీతో సంబంధం లేని వారికి కూడా ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డాన్ని పార్టీలో క్రియాశీలంగా ఉన్న నాయ‌కులు స‌హించ‌డం లేద‌న్న విష‌యాన్ని వారు గ్ర‌హించాలి. భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసుకుంటేనే బంగారు భ‌విత సాకారం అవుతుంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: