ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలని, అవినీతిని వెలికే తీసే పనిలో బిజిగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని రద్దు చేయగా, మరి కొన్ని నిర్ణయాల్లో జరిగిన తప్పులని సరిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఇసుక విషయంలో టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ... మూడు నెలల పాటు ఇసుక రవాణాని నిలిపివేశారు.


అయితే దీని వల్ల టీడీపీ అక్రమాలు బయటపడటం ఏమో గానీ, ఇసుక మీద ఆధారపడి జీవిస్తున్న కూలీలు నానా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు ఆగిపోయి కూలీలు, తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ కూలీలు, పెయింటింగ్ కూలీలు, కన్స్ట్రక్షన్ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలా కష్టాలు పడ్డారు. కూలీలు అయితే రోజు కుటుంబ పోషణ గడవక రోడ్డున పడ్డారు. దీంతో సీఎం జగన్ పరిస్థితిని గమనించి సెప్టెంబర్ 5న ఇసుకపై కొత్త పాలసీని రూపొందించారు.


ఇసుక ధర భారీగా తగ్గించి కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఇసుకని ఆన్‌లైన్లో బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  అలాగే రీచ్‌ల దగ్గర టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అదేవిధంగా ఇసుక స్టాక్ యార్డులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం, ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయడం నిషేధించారు. అయితే ఇసుక మీద కొత్త పాలసీ రావడంతో భవన నిర్మాణాలు మీద ఆధారపడిన వారు ఆనందపడ్డారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు లేదు.


ఇసుక పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదు. దీంతో కూలీల కష్టాలు మొదటికొచ్చాయి. పైగా ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేయడానికి అవడం లేదు. ఆన్ లైన్ లో ఏ ఇసుక రీచ్ ని క్లిక్ చేసిన అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. అటు ఇసుక రీచ్ ల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి సరిగా ఇసుక దొరకక కూలీలు, తాపీ మేస్త్రీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీరు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి సీఎం జగన్ దీనిపై మరోసారి దృష్టి పెట్టి తప్పు సరిదిద్దితే భవన నిర్మాణానికి సంబంధించిన వారి ఇబ్బందులు తొలుగుతాయి. వారు కూడా ప్రభుత్వం మీద పాజిటివ్ గా ఉంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: