నిన్నటి వరకు కారుకు బ్రేకులు లేకుండా జోరుగా  దూసుకుపోయింది.  ఇప్పుడు కారుకు బ్రేకులు పడుతున్నాయా అంటే సమీకరణాలు అవుననే అంటున్నాయి.  ఎప్పుడైతే కారు.. బస్సుతో పెట్టుకున్నదో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.  హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కారు పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి బహిష్కరించడంతో ఈ పరిస్థితి వచ్చింది.  


పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగింది.  ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.  సమ్మెకు దిగిన కార్మికులందరినీ విధులనుంచి తొలగించడంతో సమ్మె ఉదృతం అయ్యింది.  దీని ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడేలా కనిపిస్తోంది.  హుజూర్ నగర్లో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.  


కాగా, తెరాస కేడర్ మొత్తం హుజూర్ నగర్లోని ఉండి ప్రచారం చేస్తున్నది.  కార్మికుల సమ్మె ముందు వరకు విజయం తెరాస వైపే ఉన్నది.  ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత తెరాస కు మద్దతు ఇవ్వబోతున్న సిపిఐ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీకి సమస్యగా మారింది.  హుజూర్ నగర్లో సిపిఐ కు పెద్దగా సంఖ్యాబలం లేదు.  కానీ, కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉన్నది.  అక్కడ ప్రతి ఓటు కూడా ఇప్పుడు చాలా కీలకమైనది.  అందుకే సిపిఐ మద్దతు కోరింది.  


కానీ, ఇప్పుడు సిపిఐ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో తెరాస పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది.  మరో వారం రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.  ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలి అంటే ఆర్టీసీ కార్మికుల విషయంలో పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలి.  కానీ, అలా తీసుకోవడానికి కెసిఆర్ సిద్ధంగా లేరు అన్న విషయం ఇప్పటికే స్పష్టం అయ్యింది.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  ఎవరికీ హుజూర్ నగర్ ప్రజలు ఓట్లు వేస్తారో.. ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: