కాంగ్రెస్ పార్టీ అనేగానే..ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌.. నేత‌లంతా ఇష్టారీతిన మాట్లాడుతారు. నిత్యం ఒక‌రిపై విమ‌ర్శ‌లతో కాలం వెల్ల‌దీస్తారు.. పార్టీ కంటే ప‌ద‌వుల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పార్టీ ఇంత‌లా న‌ష్ట‌పోతుంది... అని పార్టీ శ్రేణుల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌లు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ.. హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో అనూహ్య మార్పు తెచ్చింద‌నే టాక్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా న‌డుస్తున్నారు.

           ఎక్క‌డ కూడా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ఆధిప‌త్యానికి పోకుండా.. పార్టీని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.ఈ మార్పుతో పార్టీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల‌న్న క‌సితో కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో టీపీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గెలిచారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డి బ‌రిలో నిలిచారు. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బ‌రిలో ఉన్నారు.


           అయితే.. ఉప నోటిఫికేష‌న్‌కు ముందు ఉత్త‌మ్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మ‌ధ్య అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో కొంతమేర‌కు మాట‌ల యుద్ధం న‌డిచిన విష‌యం తెలిసిందే. కానీ.. ఇప్పుడు నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా న‌డుస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను ఓడించి.సీఎం కేసీఆర్ ప‌త‌నం మొద‌లైంద‌నే బ‌ల‌మైన సంకేతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న వ్యూహంతో నేత‌లంతా ఐక్య‌తారాగం తీస్తున్నారు. 

            ఇక్కడ గెలిచి అధికారపార్టీపై మరింత ఒత్తిడి తేవాలని క‌ష్ట‌ప‌డుతున్నారు. పార్టీలోని కీలక నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తదితరులు విస్త్రృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మండలాలు, గ్రామాలవారీగా ప్రచారం చేస్తున్నారు.
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఎటు చూసినా కాంగ్రెస్‌ అగ్రనేతలు, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన సంఘ నేతలు హ‌డావుడి చేస్తున్నారు. పార్టీ శ్రేణులు,నాయకులతో మాట్లాడుతూ స్థానిక పరిస్థితిని తెలుసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: