వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు లాభదాయకమైన పథకం అందుబాటులోకి తీసుకురానుంది. వైఎస్ఆర్  రైతు భరోసా పథకం పేరుతో రైతులకు లాభం చేకూర్చనుంది. నేడు నెల్లూరు జిల్లా కాకుటూరులో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు నెల్లూరులోని విక్రమసింహపూరి యూనివర్సిటీలో పూర్తయ్యాయి.


నేడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా చెక్కులను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. కౌలు రైతులకు ఉపయోగపడే కార్డులు సీఎం పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ గా పేరు నిర్ణయించారు. ఎన్నికల హామీలో చెప్పిన 12,500 కంటే 1000 అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 13,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 5 ఏళ్లలో ఈ మొత్తం 67,500 ఇవ్వనున్నారు. ఈ పధకం ద్వారా 54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 40 లక్షల మంది రైతులను, సాగుదారులను ఎంపిక చేశారు. 

లబ్ధిదారులు అందరికీ నిధులు ఒకే రోజు జమ చేయనున్నారు. అర్హులైన రైతులు, కౌలుదారు కుటంబాల వారి అకౌంట్లకు నేరుగా జమ చేయనున్నారు. ఈమేరకు అమరావతిలో జరిగిన అగ్రి మిషన్ భేటీలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో 8,750 కోట్లు కేటాయించారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు, పగటిపూటే వ్యవసాయానికి విద్యుత్, రైతు బలవన్మరణానికి పాల్పడితే బీమా కింద ఉన్న 5 లక్షలను 7 లక్షలు.. పై నిన్న జరిగిన అగ్రి మిషన్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.


జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. జగన్ పాదయాత్రలో కూడా రైతుల సమస్యలను చూసిన జగన్ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే సీఎంగా జగన్ రైతులకిచ్చిన హామీ నెరవేరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: