వైసీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరులో జరుగుతున్న జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వైసీపీ బాధితుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా నాయకులతోపాటు  పలువురు పాల్గొన్నారు.

 

 

 

ఈ సంధర్భంగా పలువురు ఈ సమావేశంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, ఎదురైన ఇబ్బందుల గురించి చంద్రబాబు సమక్షంలో చెప్పుకున్నారు. అనంతరం దీనిపై చంద్రబాబు స్పందించారు. ఇది నేరస్థుల ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని, అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. పార్టీ మారకపోతే దాడులు చేస్తామంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని.. బలహీన వర్గాలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని అన్నారు. వైసీపీ దాడులతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, నేను మీలాగే వ్యవహరిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. దొంగసారా, బెట్టింగ్ కాసే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఆరోపించారు.  వైసీపీ ఎమ్మెల్యేకు పిచ్చి పట్టిందని, మహిళల జోలికొస్తే తాట తీస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.. జగన్ జేఎస్టీని తలపిస్తూ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్ కు తెరతీసుతున్నారని కార్యకర్తలనుద్దేశించి అన్నారు.

 

 

 

ఈ సమావేశం ద్వారా కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఎన్నికల అనంతరం ఆయన తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చారు. గత ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకుని టీడీపీకి భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు పర్యటన ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: