ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం యొక్క తీరుపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేసింది. ఈ నెల 18వ తేదీలోగా సమస్యల పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకోవాలనే ఆశాభావం కోర్టు వ్యక్తం చేసింది. ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 
 
5వ తేదీన సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం 4 వేల బస్సులు నడపకుండా ప్రజలు ఇబ్బందులు పడట్లేదని ఎలా చెబుతుందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కార్మికులు సమ్మెను విరమించటానికి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేసిందో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. 
 
ఆర్టీసీ కార్మికుల కొత్త బస్ లు కొనాలన్న డిమాండ్ సంస్థ కోసం మరియు ప్రజలకోసం అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఏం తక్కువ ? రాష్ట్రానికి సౌకర్యాలు మెరుగ్గా ఉంటే పెట్టుబడులు వస్తాయని  ప్రభుత్వ విజన్ - 2040గా ఉండాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. గతాన్ని విస్మరించాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే 40, 50 సంవత్సరాల్లో ప్రజల అవసరాలు తీర్చే విధంగా  కార్పొరేషన్ ఉండాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
శాశ్వత ఎండీ నియామకానికి అడ్డంకులు ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా  ప్రభుత్వం చర్యలు ఉండాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచనలు చేసింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీయార్ కు షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని, ప్రైవేట్ పాఠశాలలకు అదనపు సెలవులు రద్దు చెయ్యాలని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: