తెలంగాణ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం జ‌రుగుతున్న లిక్క‌ర్ షాపుల య‌జ‌మానుల ఎంపిక‌కు రంగం సిద్ధ‌మైంది. శుక్ర‌వారం రోజున లిక్క‌ర్ కింగ్‌లు ఎవ్వ‌రో తేలిపోనున్నది. అందుకు తెలంగాణ స‌ర్కారు స‌న్న‌ద్ద‌మైంది. ఏపీలో లిక్క‌ర్ అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తుంది.. కానీ తెలంగాణ‌లో మాత్రం షాపుల వారిగా య‌జ‌మానులను ఎంపిక చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నది. అందుకు త‌గిన విధంగా ఈరోజు య‌జ‌మానుల ఎంపిక కోసం ల‌క్కీ డ్రాలు  తీయ‌నున్నారు.


అందుకు జిల్లా క‌లెక్ట‌ర్‌ల నేతృత్వంలో ఈ డ్రాల కార్య‌క్ర‌మం సాగ‌నున్న‌ది.. రాష్ట్రంలో మ‌ద్యం షాపుల డ్రా కోసం ఏర్పాట్లు చేసిన‌ట్లు ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ సోమేష్ కుమార్ తెలిపారు.  గతేడాది కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. లక్కీ డ్రా తీసేందుకు ప్ర‌తి జిల్లా కేంద్రంలో కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం 2,216 దుకాణాలకు 48,401 దరఖాస్తులు వ‌చ్చాయి.


గ‌తంలో  2017లో దరఖాస్తుల ద్వారా రూ.412 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.968.02 కోట్లతో  ప్రభుత్వానికి గతేడాది కంటే అదనపు ఆదాయం వచ్చిందని ఆయ‌న తెలిపారు.  డివిజన్లవారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డిలోని 422 మద్యం షాపులకు 8,892 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.177.84 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలకు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లాలో ఐదు కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం షాపులకు డ్రా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  


జిల్లాలో బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు, ఆర్మూర్ పరిధిలో మూడు, నిజామాబాద్ పరిధిలోని రెండు షాపుల డ్రాను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తానికి ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో ల‌క్కి విజేత‌లు ఎవ్వ‌రో.. లిక్క‌ర్ కింగ్‌లు ఎవ్వ‌రో తేలిపోనున్న‌ది. ఈ రోజు లిక్క‌ర్ షాపుల‌ను ద‌క్కించుకునే అదృష్ట‌వంతులు ఎవ్వ‌రో ఏమో చూద్దాం...


మరింత సమాచారం తెలుసుకోండి: