హైకోర్టు ధర్మాసనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఈరోజు ఉదయం 10.30 గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. హైకోర్టు సూచనలతో సీఎం కేసీఆర్ నుండి ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఆశించినా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. సీఎంవో కార్యాలయం నుండి నిన్న రాత్రి ఉన్నతాధికారులకు ప్రగతి భవన్లో సమావేశానికి రావాలని సమాచారం వెళ్లింది. 
 
ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కానీ సమీక్షా సమావేశం మాత్రం జరగలేదని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించే విషయమై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పట్లో చర్చలు ఉంటాయా...? చర్చలు మరింత ఆలస్యమవుతాయా...? అనే ప్రశ్నలకు సమాధానం తెలియటం లేదు. 
 
కార్మిక సంఘాలు ఈరోజు రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి సమాయత్తమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ వ్యాపారులు కూడా బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ప్రజలు కూడా బంద్ కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. ఆటో, క్యాబ్ సంఘాలు మరియు ఉద్యోగ, ప్రజా సంఘాలు బంద్ కు మద్దతు పలికాయి. ప్రభుత్వం మాత్రం బంద్ ప్రభావం పడకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ కార్మికుల కడుపు మండి ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చెబుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, ప్రభుత్వం కోర్టు ఆదేశంతోనైనా సిద్ధం కావాలని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తాము ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లపై చర్చ జరగాల్సిందేనని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం సీఎం ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ ముఖ్యదర్శితో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: