తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు  డిమాండ్ చేస్తోంది. తెలంగాణ  ఉద్యమంలో  ముందుండి పోరాడిన ఆర్టీసీ కార్మికుల హక్కులను  కాలరాయడం ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వానికి నిదర్శనంగా  భావిస్తున్నాయి. ఈ క్రమంలో కార్మికులకు అండగా నిలిచేందుకు జర్నలిస్ట్ యూనియన్లు కూడా రాష్ట్ర బంద్ లో  చేయిచేయి కలపడం గమనార్హం.
శనివారం బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బస్సులను నడిపించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ ముందుగానే బంద్ ప్రకటించడంతో ఒక్క బస్సు కూడా కదలడం లేదు.




తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగ సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు కూడా బంద్‌కు మద్దతుగా నిలిచాయి.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వినర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు.




తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వమే స్పందించడం లేదని, కోర్టు ఆదేశంతోనైనా ప్రభుత్వం చర్చలకు రావాలని చెప్పారు. అయితే తాము ప్రభుత్వం ముందుంచిన 25 డిమాండ్లను నెరవేర్చేందుకు చర్చ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆర్టీసీ  కార్మికులు  చేపట్టిన  బంద్ కు  జర్నలిస్ట్ అసోసియేషన్  ఆఫ్ తెలంగాణ (జాట్) సంపూర్ణ మద్దతు తెలిపింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో పంతానికి పోయి ప్రజలను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కెసిఆర్ కు తగదని జాట్ హెచ్చరిస్తోంది. ఈ బందులో జాట్ సభ్యులందరo పాల్గొని కార్మికులకు అండగా ఉందామని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రవాణాలో ఎటువంటి ఇబ్బంది తలెత్తడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనితో పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: