ఆస్తి క్రయ విక్రయదారులు తమ దస్తావేజులను ఆన్‌లైన్‌లో స్వయంగా తయారుచేసుకొనే విధానానికి ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుండి శ్రీకారం చుట్టిందని రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ రాష్ట్ర సంయుక్త ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.రవికుమార్ చెప్పారు. దస్తావేజు స్వయంగా తయారుచేసుకోవడంపై శ‌నివారం విజ‌య‌వాడ‌లోని స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు, వారి సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ మాట్లాడుతూ ఈ విధానాన్ని కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నామన్నారు. నవంబర్ 2వ తేదీ నుండి ఆస్తి క్రయ విక్రయాలు, గిఫ్ట్ డీడ్స్ ఆన్‌లైన్ ద్వారా దస్తావేజును స్వయంగా తయారుచేసుకోవచ్చని చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్‌లో అమలు చేసిన అంశాలలో పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్లన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచే నూతన ప్రక్రియకు ప్రభుత్వం పెట్టిందన్నారు.




ఈ ఆన్‌లైన్ విధానం వల్ల దస్తావేజులు, అమ్మకం, కొనుగోలు వ్యవహారాలన్నీ సులభతరం అవుతాయ‌ని తెలిపారు. మధ్య దళారీలు ప్రమేయం లేకుండా నేరుగా ఆస్తి క్రయ విక్రయదారులు తమ దస్తావేజులను ఆన్‌లైన్‌లో స్వయంగా తయారుచేసుకొనే విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఎస్ఎసి రూపొందించిన ఆన్‌లైన్ సాఫ్ట్ వేర్ విధానాన్ని రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేయనున్నదన్నారు. ఈ విషయంపై సాధారణ ప్రజలు, న్యాయవాదులు, స్థిరాస్థి వ్యాపారులు, బ్యాంకు అధికారులు, గణాంక నిపుణులు తదితరులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ ఏ విధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చునో పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నామన్నారు.




ఆన్‌లైన్ ద్వారా దస్తావేజు తయారుచేయు ప్రక్రియ, రిజిస్ట్రేషన్ చేసుకునే వారి వివరాలు దస్తావేజులో నమోదు, ఆస్తి షెడ్యూల్‌ను నమోదు చేసి అవసరమైన డ్యూటీని చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేయించుకొను వారి మధ్య అంగీకారమైన షరతులను నిబంధనలు పొందుపరచడం, తయారైన దస్తావేజు పొందడం, రిజిస్ట్రేషన్ కొరకు ఎంపిక చేసుకున్న సమయాన్ని ముందుగా నిర్దేశించుకొనడం వంటి 6 స్టెప్పుల ద్వారా ఆన్‌లైన్ ద్వారా దస్తావేజు తయారీ చేసుకునే విధానం ఉంటుందన్నారు. ఆన్‌లైన్ విధానంతో దస్తావేజు తయారీ, దస్తావేజు పొందడం గురించి యూజర్ మాన్యువల్ సంబంధిత స్క్రీన్ షాట్‌లతో దశల వారీ విధానాన్ని వివరిస్తుందన్నారు. ప్రజలు మధ్యవర్తులపై ఆధారపడకుండా స్వయంగా దస్తావేజులు సులభంగా తయారుచేసుకోవడానికి నూతన విధానం వీలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డిఐజి యం.శ్రీనివాసమూర్తి, జిల్లాలోని సబ్ రిజిస్టార్లు, స్థిరాస్తి వ్యాపారులు, సాధారణ ప్రజలు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: