హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ముగియడం తో స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచివెళ్లాలని ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు . ఇప్పటికే స్థానికేతరులైన నాయకులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లగా, టి -పిసిసి అధ్యక్షుడు , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కూడా నియోజవర్గాన్ని విడిచి వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు . ఈ మేరకు ఆయన కు ఫోన్ చేసి , అదే విషయాన్ని  చెప్పడం తో,  కలెక్టర్ ఆదేశాలపై ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు .


 తాను హుజూర్ నగర్ ఓటరని అని , తనని నియోజకవర్గం విడిచి వెళ్ళమని  ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు . అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వద్దే తేల్చుకుంటానని చెప్పి , ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు . గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పోటీ చేసి విజయం సాధించిన  విషయం తెల్సిందే . అయితే  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు . అనంతరం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు . ఉత్తమ్ రాజీనామాతోనే , ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది .


 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి   ఉత్తమ్  పోటీ చేయడమే కాదు ... హుజూర్ నగర్ ఓటరన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ విస్మరించినట్లు తెలుస్తోంది . అందుకే అయన , ఉత్తమ్ ను ఇతర పార్టీ నేతల ఫిర్యాదు మేరకు స్థానికేతరుడిగా భావించి  నియోజకవర్గాన్ని విడిచివెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం . అయితే ఉత్తమ్ స్థానిక ఓటరే కాకుండా , అయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నల్గొండ లోక్ సభ  నియోజకవర్గ పరిధి లోనే హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉందన్న విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ విస్మరించడం విమర్శలకు దారితీస్తోంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: