రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక సోమవారం ఉద‌యం పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్ర‌క్రియ నిర్వహించనున్నారు. 24న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 2,36,943 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,16,508 మందికాగా, పురుషులు, 1,20,435 మంది ఉన్నారు.  


పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న‌ల్ల‌గొండ లోక్‌సభకు ఎంపిక కావడంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా త‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డిని బ‌రిలోకి దింపారు ఉత్త‌మ్‌. ఇక టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా శా నంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్‌ కోటా రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.


ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్‌ యూనిట్‌తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు. మొత్తం 1,497 మంది పోలింగ్‌ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. ఈ ఉప ఎన్నిక‌ను అధికార టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించాయి.


ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఏడు మండ‌లాలు ఉన్నాయి. నాలుగైదు మండ‌లాల్లో ఓ పార్టీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ఉన్న‌ట్టు ప్రి పోలింగ్ అంచ‌నాలు చెపుతున్నాయి. ఈ సారైనా ఎలాగైనా హుజూర్‌న‌గ్‌లో పాగా వేయాల‌ని గులాబీ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకొని, ప‌ట్టు నిలుపుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీలు స‌ర్వ శ‌క్తులు ఒడ్డాయి.  అయితే ఓట‌రు దేవుళ్లు ఎవ‌రిని క‌నిక‌రించారో తెలియాలంటే మాత్రం ఈనెల 24 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: