సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్‌ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకున్న కిలాడీ కేడి లేడి మామిళ్ళపల్లి దీప్తి గుంటూరు కార్పొరేషన్‌లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహిస్తానంటూ ఏకంగా ఒక కాంట్రాక్టనే కొట్టేసింది.  2017లో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్‌ దరఖాస్తులు ఆహ్వానించగా....తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుని, ఆ కాంట్రాక్ట్‌ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టింది.

అప్పటికే ఒక మంత్రిని బుట్టలో వేసుకున్న దీప్తి ఆయనతో కార్పొరేషన్‌ రికమండ్‌ చేయించి కాంట్రాక్ట్‌ దక్కించుకుంది.తనకున్న సంబంధాలను అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్‌ అధికారులకు తరచూ ఫోన్‌ చేయించి వారిని దారికి తెచ్చుకుంది.
ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్‌ రూ.60 వేల చొప్పున తీసుకొని ఈవెంట్ ని మాత్రం  20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. 

ఏడాది పాటు ఈ కార్యక్రమాలు ఇలా నీరుగారినట్టు నడవటంతో జనాలు ఆరోపించడం మొదలెట్టారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో...కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్‌ లఠ్కర్‌ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం బిల్లు పెండింగ్‌లో ఉంది.నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన దీప్తి అధికారులను సైతం బురిడీ కొట్టించడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన దీప్తి వారం రోజుల క్రితమే రెండు నివాసాలకు తాళం వేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కిలాడీ లేడీ ఆచూకీ కోసం గాలింపులో భాగంగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: