నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదిత పథకాలన్నిటినీ సకాలంలో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో నేషనల్ రూర్బన్ మిషన్ పై సిఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన పూర్తిస్థాయి కనీస మౌళిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రూర్బన్ మిషన్ ను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కావున ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ప్రతిపాదించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.



మైదాన ప్రాంతాల్లో 25వేల నుండి 50వేల జనాభా కలిగిన గ్రామాలు, కొండ గిరిజన ప్రాంతాల్లో 5వేల నుండి 15వేల జనాభా గల ప్రాంతాలను క్లస్టర్లుగా ఎంపిక చేసి 60శాతం కేంద్రం,40శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేషనల్ రూర్బన్ మిషన్ కింద 12 క్లస్టర్లను కేటాయించగా మూడు దశలుగా 1130 కోట్ల రూ.లతో 10వేల 364 పనులు చేపట్టి వీటిని అభివృద్ధి చేయనున్నారని సిఎస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 865 కోట్ల రూ.లతో 9వేల 194 పనులు చేపట్టగా వాటిలో 498కోట్ల రూ.ల విలువైన 6వేల 360 పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో ముఖ్యంగా పైపుల ద్వారా మంచినీటిని అందించడం, పూర్తిస్థాయి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, డ్రెయిన్లు, వీధి దీపాలు, అంతర్గామ కనెక్టవిటీ, ప్రజారవాణా, ప్రతి ఇంటికీ ఎల్పీజి కనెక్షన్, నైపుణ్య శిక్షణ ద్వారా ఆర్ధికాభివృద్ధికి చర్యలు తీసుకోవడం వంటివి ఈ పథకంలోని ప్రధాన లక్ష్యాలను సిఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.



 అదే విధంగా విద్య ఆరోగ్యం, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలు, డిజిటల్ లైబ్రరీ, పర్యావరణం, ఉపాధి కల్పన, స్వయం సహాయ సంఘాల ఏర్పాటు, పర్యాటకరంగ ప్రోత్సాహం, క్రీడలు మరియు సామాజిక మౌళిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం తదితర అంశాల్లో ఈ క్లస్టర్లలో పూర్తిగా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్ తెలిపారు. రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలైన ఏలూరు క్లస్టర్ డిపిఆర్, రంపచోడవరం క్లస్టర్ రివైజడ్ అప్రోవల్ గురించి వివరించగా వాటికి సమావేశంలో ఆమోదం తెలిపారు. 
అలాగే సింగరాయకొండ, కుప్పం, అరకులోయ, ఆలూరు, చందర్లపాడు, గరివిడి, నందలూర్, న్యూజెండ్ల రివైడ్జ్ డిపిఆర్ లకు ఆమోదం తెలిపారు. ఇంకా నేషనల్ రూర్బన్ మిషన్ కు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, అజయ్ జైన్, కె.దమయంతి, మున్సిపల్ శాఖ కమిషనర్ జిఎస్ఆర్ విజయ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: