తెలంగాణ రాష్ట్రం మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో మహిళలను వేధించడంలో నమోదైన కేసుల పరంగా 2017 సంవత్సరానికి మొదటి స్థానంలో ఉంది. మరోవైపు జాతీయ నేర గణాంక సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరిగిన దాడులు, అఘాయిత్యాలలో ముందు వరసలో నిలిచింది. 
 
జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,32,336 నేరాలు జరిగాయి. మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 988 కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలతో రాష్ట్రంలో 178 హత్యలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహర కల్తీకి సంబంధించిన కేసులు 2,465 నమోదయ్యాయి. 
 
దేశంలోనే 95 శాతం ఆహార కల్తీ కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కావటం గమనార్హం. శాంతి భద్రతల పరిరక్షణ విషయాల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా అనంతరం బాధితురాళ్లను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ఘటనల్లో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల నేరాల్లో పదవ స్థానంలో ఉంది. 
 
ఆన్ లైన్ మోసాలు, వృద్ధులు, మహిళల్ని మోసం చేసిన ఘటనలు, ఆర్థిక నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ స్థానంలో ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తప్పు చేసి అరెస్ట్ అయిన వారిలో తొలిసారి తప్పు చేసి అరెస్ట్ అయినవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అధికారులు ఈ వివరాలు కేవలం కేసులు నమోదు అయిన వారివి మాత్రమేనని చెబుతున్నారు. పోలీసులు నేరాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: