ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపైన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల సీఎం జగన్ తో మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమైన నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం గుంటూరులో ప్రకాశం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసులు ఉన్నవారు ముఖ్యమంత్రి  అయితే ఎంత వరకు న్యాయం జరుగుతుందని పవన్‌ కల్యాణ్‌ సూటిగా ప్రశ్నించారు. కేసులు ఉన్నవారు పై వారి దగ్గర బలంగా మాట్లాడలేరంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీ పెద్దల నుంచి సాధించింది ఏమిలేదని విమర్శించారు.



కేసు నుంచి బయట పడడానికి సమయమంతా సరిపోతుంటే ఇంకా రాష్ట్ర ప్రయోజనాల గురుంచి ఏం మాట్లాడ కలుగుతారని  ఎద్దేవా చేశారు.      
ఎన్నికల్లో ఓడిపోగానే బెంబేలు పడే వ్యక్తిని కాదని పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో  గెలిచినా, ఓడినా చివరి వరకు పార్టీని నడుపుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలుపే ముఖ్యం అనుకుంటే వంద వ్యూహాలు పన్నేవాడినని అన్నారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. నవంబర్ 3వ తేదీన విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.



రాష్ట్రానికి జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  డబ్బు, మద్యం పంచని ఎన్నికలు రావాలన్న అభిప్రాయాన్ని పవన్‌ కల్యాణ్‌  వ్యక్తం చేశారు. పరోక్షంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని సమర్ధిస్తున్నట్టుగా పవన్ వ్యాఖ్యలు చేశారు. కాగా  తనకు జగన్‌, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పడం గమనార్హం. ఆ ఇద్దరి  వల్ల  తనకు నష్టం కలిగించిన తాను పెద్దగా  పట్టించుకోనంటూ  తేలిగ్గా కొట్టిపారేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: