మన వాళ్లకు బంగారం అంటే ఎంత మక్కువో చెప్పక్కర్లేదు.  బంగారం కోసం ఎంత కష్టమైన పడతారు.  రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం కొంటుంటారు.  అలా కొన్న బంగారాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు.  అజాగ్రత్తగా ఎక్కడా ఉంచరు.  అందుకే బంగారాన్ని అపురూపంగా చూసుకుంటారు.  ఇలాంటి బంగారాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే.. అలా నిర్లక్ష్యంగా కూరగాయల బుట్టలో వేసిన బంగారాన్ని ఏదైనా జంతువు అమాంతంగా మింగేస్తే.. ఏంటి పరిస్థితి.. ఎలా ఉంటుంది... 


అదేంటి బంగారాన్ని జంతువులు మింగేయడం ఏంటి అని షాక్ అవ్వకండి... జంతువులు ఆహరం అనుకోని అప్పుడప్పుడు  కొన్ని రకాల వస్తువులు తినేస్తుంటాయి.  అమృతం సీరియల్లో అప్పాజీ ఉంగరాన్ని ఒంటె మింగేసినట్టుగా అన్నమాట.  అది సీరియల్ కాబట్టి బయటకు తీశారు.  ఒరిజినల్ గా అయితే కడుపులో ఉన్న బంగారం బయటకు వస్తుందా చెప్పండి.  ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో జరిగింది.  


హర్యానాలోని కలన్ వ్యాలీ పట్టణంలో జనక్ రాజ్ అనే వ్యాపారి భార్య, కోడలు ఓ రోజు రాత్రి ఓ కార్యక్రమానికి వెళ్లి ఇంటికి వచ్చారు.  అప్పటికే బాగా అలసిపోవడంతో.. ఒంటిపై ఉన్న నాలుగు సేవర్ల బంగారం నగలను తీసి బుట్టలో వేశారు.  అది కూరగాయల బుట్ట.  అయితే, అప్పటికే అందులో ఉన్న కూరగాయలు కుళ్లిపోయాయి.  మరుసటి రోజు చూసుకోకుండా వాటిని బయటపడేశారు. అటుగా వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయలను తినేసింది.  


బంగారు నగల కోసం వెతుక్కున్న  ఆ మహిళలు జరిగింది గుర్తుకు వచ్చి బయటకు వచ్చి చూశారు.  అక్కడ బంగారానికి సంబంధించిన చిన్న ముక్క దొరికింది.  ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సిసిటివి ఆధారంగా ఎద్దును గుర్తించి తీసుకొచ్చి ఇంటిముందు కట్టేశారు.  రోజు దాని పేడను జల్లెడ పడుతున్నారు.  కొన్ని రోజులుగా ఆలా చేస్తున్న చిన్న ముక్క బంగారం కూడా బయటకు రాలేదు.  రోజు దానికి చెరుకు పిప్పి వంటివి పెడుతున్నారు. పశువుల డాక్టర్ ను సంప్రదిస్తే.. కడుపులో నాలుగు గదులు ఉంటాయని, అందులో నుంచి బయటకు రావడం కష్టం అని అంటున్నారు.  కానీ, పాపం రోజు దానికి మేతవేస్తూ పేడను చెక్ చేస్తున్నారు.  ఎప్పటికి ఆ బంగారం నగలు బయటకు వస్తాయో ఏమో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: