ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్న వజ్రాయుధం కేవలం ఒక్క ఓటు మాత్రమే. ఆ ఓటు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఎంత అపహాస్యానికి గురి అవుతోందో చూస్తూ ఉంటే ఈ ఓటు సామాన్యుడికి పనికిరాని వస్తువుగా మారి పోయిందా? అని అనిపిస్తోంది. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం ఒకేఒక్క ఓటు తేడాతో పడిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే సామాన్యుడికి ఉన్న ఆ ఒకేఒక్క ఓటు విలువ ఏమిటో తెలుస్తుంది.  ఆయుధం బలమైనదిగా ఉన్నంత మాత్రాన సరిపోదు. దానిని ఒడుపుగా ఉపయోగించుకో గల సత్తా సామాన్యుడికి ఉన్నప్పుడే నాయకులు ఓటర్ల గురించి భయపడి ఆలోచిస్తారు. ఐదేళ్ళ పాటు మనల్ని పాలించే వారిని ఎన్ను కోవలసిన రోజు రానే వచ్చింది. కనీసం ఈ ఒక్కరోజైనా సమస్యలన్నీ పక్కన పెట్టి కుల, మత, ధన వ్యామోహాలకు దూరంగా వాస్తవ దృష్టితో మన భావితరాల భవిష్యత్ ను ఆలోచించి సరైన వారిని ఎన్నుకునే నిర్ణయం తీసుకుందాం. నా ఒక్కడి ఓటు పడకపోతే ఏమవుతుంది అన్న ఆలోచన వద్దు. ఒకొక్క బిందువు కలిస్తేనే సముద్రం. ప్రజాస్వామ్యంలో మనమే శాసన కర్తలo. మనం వేసే ఒకేఒక్క ఓటు మన జీవితాలను శాసిస్తుంది అన్న నిజం తెలుసుకున్ననాడు అలసత్వం వీడి మన ఓటును వజ్రాయుధంగా మార్చి మనదేశాన్ని మనజాతిని నిర్వీర్యం చేస్తున్న రాజకీయ నాయకులకు సింహ స్వప్నoగా మారగలుగుతాం లేదంటే మరోసారి స్వార్ధ రాజకీయ నాయకుల ఎదుగుదలకు నిచ్చిన మెట్లుగా మారిపోతాం. మంచి నాయకులను ఎన్నుకునే జ్ఞానోదయాన్ని ఈ నాటి ఓట్ల పండుగ సూర్యోదయం కలుగ చేస్తుందని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: