జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 8న నవ్యాంధ్ర ప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం యబోతున్నారు. ఇప్పుడు వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ ప్రమాణానికి చంద్రబాబు అతిథిగా వస్తారా... రారా..? చంద్రబాబు ప్రమాణానికి కేసీఆర్ వెళ్తారా వెళ్లరా? అనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకేసారి ముఖ్యమంత్రులు కాబోతున్నా.. వీరిద్దరి మధ్య ఉన్నది ఉప్పు - నిప్పు తరహా వ్యవహారమేనన్న సంగతి తెలిసిందే.. కేసీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించామని తెలియగానే.. పెట్టిన ప్రెస్ మీట్లో చంద్రబాబుకు, మోడీకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రెస్ మీట్లో ముందుగా చెప్పిన మాటలు కూడా అవే. చంద్రబాబు మాత్రం కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రికేయుడు రాధాకృష్ణ కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారా అంటే చంద్రబాబు సమాధానం దాట వేశారు. కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు కదా.. అంటే .. మీడియాలోనే చెప్పారు. నాకేం ఫోన్ చేయలేదు. మేం ఫోన్ లో మాట్లాడుకోలేదు అన్నారు చంద్రబాబు.. మరి శుభాకాంక్షలు చెప్పరా.. అని గుచ్చి గుచ్చి అడిగితే.. చూద్దాం అన్నట్టు తల ఊపారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అని చంద్రబాబును ఢిల్లీలో విలేకరులు అడిగినప్పుడు... నాకింకా ఆహ్వానం రాలేదు. వస్తే చూద్దాం అన్నట్టు మాట్లాడారు. అధికారులు మాత్రం కేసీఆర్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కు కూడా ఆహ్వానపత్రాలు పంపారు. వీరితో పాటు ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రోటో కాల్ ప్రకారం పంపారు. ఆహ్వానం లేదన్న చంద్రబాబు.. మరి ఇప్పుడ ఆహ్వానం అందిన తర్వాతైనా కేసీఆర్ ప్రమాణస్వీకారానికి వస్తారా అన్నది చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రమాణం జూన్ 8 న ఉన్నందువల్ల.. కేసీఆర్ కు ఆహ్వానం పంపేందుకు ఇంకా సమయం ఉంది. మరి ఆహ్వాన పత్రం కేసీఆర్ కు పంపుతారా లేదా అన్నది చూడాలి. ఇక నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరినీ ఆహ్వానించడం... ఆ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరవ్వడం తెలిసిన విషయమే. మోడీ కేసీఆర్ ను ఆహ్వానించినా.. కేసీఆర్ మాత్రం తన ప్రమాణానికి మోడీని ఆహ్వానించిన దాఖలాలు కనిపించలేదు. ఇదే విషయంపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ వినోద్.. మోడీని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పిలుస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రమాణం చేసిన తర్వాత ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చి మోడీని కలుస్తారని.. ఆహ్వానిస్తారని వినోద్ చెప్పారు. అప్పుడు పిలిస్తే పిలవవచ్చు కానీ.. ప్రమాణస్వీకారానికి ఎందుకు పిలవలేదన్నది అర్థంకాని విషయం.. అందులోనూ మోడీ కేసీఆర్ ను పిలిచారాయె. మరో పక్క.. చంద్రబాబు మాత్రం మోడీని తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేశారు. కేసీఆర్, చంద్రబాబు.. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఆ తర్వాత రాజకీయంగా మార్గాలు వేరయినా... ఇప్పుడు మాత్రం ఇద్దరూ ముఖ్యమంత్రులే. అందులోనూ రెండూ ఇరుగు పొరుగు రాష్ట్రాలు.. ఒకే రాష్ట్రం నుంచి విడిపోతున్న రాష్ట్రాలు.. వీరిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉంటే.. రెండు రాష్ట్రాలకూ అంత శ్రేయస్కరం. అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం ప్రస్తుతం ఇద్దరి మధ్యా కనిపించడం లేదు. ఇక ముందైనా సామరస్యంతో ముందుకు సాగితే అదే పదివేలు..  

మరింత సమాచారం తెలుసుకోండి: