మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా ప్రధాని బరిలో దిగి చావుతప్పి కన్నులొట్టపోయిన కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ.. మరోసారి తనకు హక్కులు తప్ప బాధ్యతలు పట్టవని నిరూపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి యూపీఏ అధికారంలోకి వస్తే ఎంచక్కా ప్రధాని అయిపోవాలని కలలు కన్న ఈ గాంధీ కుటుంబ యువకిశోరం.. పార్టీ ఘోర పరాజయం పాలవడంతో.. కొన్నాళ్లు హాయిగా రెస్టు తీసుకుందామని డిసైడైపోయారు. అధికారం కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా కూడా స్థానాలు సాధించలేని పార్టీని పునరుజ్జీవింజేయాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుని.. తాను మోడీ ఎలా సమఉజ్జీకారో మరోసారి నిరూపించారు. పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో.. లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై జోరుగానే ఊహాగానాలు సాగాయి. ఈ బాధ్యతను సోనియాగానీ.. ఆమె కుమారుడు రాహుల్ గానీ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ ముందు తేలిపోయిన రాహుల్.. ప్రతిపక్షనేతగా అనుభవం సంపాదించి.. ఐదేళ్ల తర్వాత మరోసారి మోడీతో పోటీపడేందుకు తగిన సామర్థ్యం సంపాదించుకోవాలని ఆశించారు. కానీ మొద్దబ్బాయి రాహుల్ మరోసారి బాధ్యతల నుంచి పారిపోయారు. అనూహ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా సీనియర్ నేత, కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గేను నియమించారు. మొదట నుంచీ ఈ స్థానానికి సోనియా, రాహల్ లతో పాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఒక దశలో కమల్ నాథ్ ఎంపిక జరిగిపోయిందనే మీడియాకు లీకులు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో సోనియా ఖర్గేను ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఖర్గేకు రాజకీయాల్లో దాదాపు అర్థ శతాబ్దపు అనుభవం ఉంది. కర్నాటక అసెంబ్లీకి ఆయన 9సార్లు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లోనూ మోడీ ప్రభావాన్ని తట్టుకుని గెలిచారు. కాంగ్రెస్ దేశం మొత్తం మీద గెలుచుకున్న స్థానాల్లో కర్నాటకలోనే అత్యధికంగా 9 స్థానాలు వచ్చాయి. ఖర్గే ఎంపిక వెనుక ఇదో కారణం కావచ్చని అంచనా. ఖర్గే ఎంపికపై కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. ఈ బాధ్యతను రాహుల్ చేపట్టకుండా పారిపోవడం ఏంటని పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: