కుటుంబానికే మంత్రిపదవులు కట్టబెట్టారని విమర్శలు వస్తాయని తెలిసినా.. కేసీఆర్ తన కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. తన కొడుకు తారక రామారావును ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రిగా, మేనల్లుడు హరీశ్ రావును భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రాష్ట్రవిభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ట్రాల మధ్య పరిశ్రమల పోటీ అనివార్యంగా మారనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో ఎక్కువ శాతం సీమాంధ్రులవే అన్నసంగతి అందరికీ తెలిసిందే. విభజనకు ముందు కన్నా.. ఇప్పుడు అంతకు కొన్ని రెట్ల మంది పారిశ్రామిక వేత్తలు తమ భవిష్యత్తుపై బెంగపెట్టుకుంటున్నారు. వీలైతే తరలిపోవాలని యోచిస్తున్నారు. ఈ పారిశ్రామిక వలసలను ఆపాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నుంచి గట్టి హామీ రావాలి. నేనున్నాను మీకేంకాదని భరోసా ఇవ్వగలగాలి. ఆ పని చేయాలంటే ఆ శాఖను కేసీఆర్ గానీ.. లేదా ఆయన ప్రతినిధిగా కేటీఆర్ గానీ ఉంటేనే.. పారిశ్రామిక వేత్తల వలసను నిరోధించవచ్చన్నది టీఆర్ఎస్ నేతల వ్యూహం. కేసీఆర్ ఇప్పటికే సాధారణ పాలనతో పాటు కీలకమైన సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. కొడుకుకు ఐటీ శాఖ ఇచ్చినా.. పరిశ్రమల వ్యవహారాలు కూడా కేటీఆరే చూసే అవకాశం ఉంది. కేసీఆర్ తన ప్రతినిధే ఐటీ మంత్రిగా ఉండాలని భావిస్తే.. హరీశ్ రావుకే ఈ శాఖ ఇవ్వొచ్చుకదా అన్న సందేహం రావడం సహజం. కానీ హరీశ్ రావు స్వతహాగా ఉద్యమ నాయకుడు. ఆయనతో పోలిస్తే... కేటీఆర్ విద్యాధికుడు.. అందులోనూ విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేసి వచ్చినవాడు. ఈ రెండింటికి తోడు సాక్షాత్తూ కేసీఆర్ తనయుడు. అందుకే అంతటి కీలకమైన శాఖను కేటీఆర్ కే అప్పగించారని తెలుస్తోంది. దీనికి తోడు కేటీఆర్ కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురితో సత్సంబంధాలు ఉన్నాయి. తమ గోడు చెప్పుకోవడానికి హరీశ్ రావు కంటే.. వారికి కేటీఆరే సరైన ఆప్షన్. ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక సౌకర్యాలు, పన్ను రాయితీలు వంటి ప్లస్ పాయింట్స్ .. పారిశ్రామిక వేత్తలను అటువైపు లాగుతాయి.. ఆ పోటీని తట్టుకుని.. తెలంగాణ నిలబడాలంటే.. తన కొడుకుగా కేటీఆరే సరైన ఎంపికగా కేసీఆర్ భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: