ల్యాంకో హిల్స్... సీమాంధ్ర ఐకాన్ గా ముద్రపడిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది. హైదరాబాద్ లో అత్యంత విలువైన ప్రాంతాలుగా పేరున్న మాదాపూర్, బంజారా హిల్స్ కు అతి సమీపంలోని మణికొండలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు.. నగరంలో అత్యంత ఎత్తైన భవనాలుగా పేరుతెచ్చుకున్నాయి. అందరి దృష్టినీ ఆకర్షించాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను వేలంలో కొనుక్కొన్న లగడపాటి రాజగోపాల్.. ఈ ప్రాజెక్టుకు ఊపిరిపోశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ల్యాంకో హిల్స్ ప్రాజక్టుకు బాగా ప్రాచుర్యం లభించింది. ల్యాంకో హిల్స్ వంటి ఆస్తుల కోసమే లగడపాటి రాజగోపాల్ సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని.. అక్రమంగా భూములు సంపాదించి కట్టారని.. తెలంగాణవాదులు మండిపడ్డారు. చాలాసార్లు తెలంగాణవాదులు.. ల్యాంక్ హిల్స్ భవనాలు ఎక్కి తెలంగాణ జెండాలు ఎగరేశారు. ప్రముఖ ఉద్యమకారిణి విమలక్క ఈ కేసులోనే జైలు పాలయ్యారు కూడా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరోసారి ల్యాంకో హిల్స్ వార్తల్లోకి ఎక్కుతోంది. ఇప్పటికే గురుకుల ట్రస్టు భూముల్లోని భవనాలపై కొరడా ఝుళిపించిన కేసీఆర్ ప్రభుత్వం.. ల్యాంకో హిల్స్ అక్రమాలపైనా దృష్టి సారించింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు అందజేయాలని.. సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ల్యాంకో హిల్స్ ను సందర్శించి.. తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదికి అందజేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై తాజా స్పందించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని ల్యాంకో హిల్స్ భూముల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన పిటీషన్ ను వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. వక్ఫ్ భూములను నిబంధనలకు విరుద్దంగా ల్యాంకో హిల్స్ కు కేటాయించారని.. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తామని హరీశ్ రావు చెప్పారు. ల్యాంకో హిల్స్ భూములపై ఇంకా కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్ననేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సర్కారు తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: