జూన్ 2 నుంచి అధికారికంగా మునుపటి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ఇంకా విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ప్రధానంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే ఆర్టీసీ వంటి సంస్థ ఇంకా విడిపోలేదు. ఎందుకంటే ఆర్టీసీ విభజన అంత సులువైందేమీ కాదు. దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థను ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా విభజించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కివస్తున్నాయి. రాష్ట్రం విడిపోయి దాదాపు నెల రోజులు కావస్తున్న తరుణంలో తెలంగాణ ఆర్టీసీ కోసం అధికారులు ప్రత్యేక లోగోను తయారు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లోగోను రూపొందించారు. దశాబ్దాల తరబడి ప్రాచుర్యంలో ఉన్న లోగో కావడం వల్ల పెద్దగా మార్పులు చేయలేదు. అంతకుముందు ఏపీఎస్ ఆర్టీసీ ఉని ఉండే అక్షరాలు.. ఇకపై టీఎస్ ఆర్టీసీ అని ఉంటాయి. బస్సు చక్రం, స్టీరింగ్ ను పోలి ఉంటుందీ లోగో... బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అని ఉన్న పాత క్యాప్షన్ ను కూడా మార్చలేదు. కాకపోతే లోగోను గులాబీ రంగులో రూపొందించారు. ఏపీ లోగో లో రాష్ట్రం మ్యాప్ ఉండదు. కానీ తెలంగాణ లోగోలో తెలంగాణ మ్యాప్ ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ లోగో ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఐతే.. లోగో రంగులపై తుది నిర్ణయం జరగాల్సి ఉంది. గులాబీ రంగు వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆమోద ముద్ర పడినా ఈ లోగో వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఆర్టీసీ విభజన పూర్తయిన తర్వాతే.. తెలంగాణ లోగో బస్సులపై కనిపించే అవకాశాలున్నాయి. 230కు పైగా డిపోలున్న భారీ వ్యవస్థ కావడం వల్ల ఆర్టీసీ విభజన మరింతగా ఆలస్యం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: