కొత్త రాజధానిగా బెజవాడ-గుంటూరు ప్రాంతం దాదాపుగా ఖరారైపోయింది. రాజధాని ఎంపికపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకపోయినా.. రాష్ట్రప్రభుత్వ వైఖరి తెలిసిన ఎవరైనా రాజధాని ఏదో ఇట్టే చెప్పేస్తారు. ఇక మిగిలింది అధికార ప్రకటన మాత్రమే. అందుకే హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా బెజవాడకు తరలిపోతున్నాయి. సాధ్యమైనంత త్వరగా సొంత ప్రాంతం నుంచి పాలనసాగించాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంగా వార్తల్లోకి ఎక్కడంతో విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్ట్టేట్ కూడా బీభత్సంగా ఉపందుకుంది. అయితే ఇప్పుడు ఏపీ కొత్త రాజధాని గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. విజయవాడ-గుంటూరు ప్రాంతానికి భూకంపాల ముప్పు బాగా ఉన్నదట. ఈ విషయాన్ని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన తాజా నివేదికలో పొందుపరిచిందట. విజయవాడ- గుంటూరు చుట్టుపక్కల దాదాపు 25 భూకంప కేంద్రాలను గుర్తించారట. రాజధాని ప్రాంతమైతే.. భారీ నిర్మాణాలు చోటు చేసుకోవడం ఖాయం. ఆకాశహర్మ్యాలు నిర్మించడమూ తప్పదు. అందులోనూ చంద్రబాబు సింగపూర్ చేస్తానంటున్నాడు కూడా. కానీ ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపడితే భూకంపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేకతల్లో ఈ భూకంపాలు రాకపోవడం కూడా ఒకటి. మరి లక్షల కోట్లు వెచ్చించి కొత్తరాజధాని కట్టుకున్నాక.. అది కాస్తా భూకంపాల కారణంగా నేలపాలైతే ఎలా.. తాజాగా వెలుగుచూసిన వాస్తవంతో ఏపీ ముఖ్యమంత్రి పునరాలోచన చేస్తారా.. లేదా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: