వాళ్లంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినవారు.. ఇప్పుడు రాష్ట్రవిభజనతో ఆందోళన చెందుతున్నారు. టీచర్లకూ, రాష్ట్రవిభజనకూ సంబంధమేంటనుకుంటున్నారా.. సమైక్య రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్లు ఉండేవి. నాన్ లోకల్ కోటా కింద ఉద్యోగాలు పొందినవారు.. ఎప్పటికైనా తమ సొంత జిల్లాకు వెళ్లవచ్చులే అన్న దీమాతో ఉండేవారు. ఇప్పుడు విభజన కారణంగా.. ఆ అవకాశం కోల్పోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.            వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు దాదాపు 600లకు పైగానే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వీరిలో దాదాపు 500 మందికిపైగా సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆసక్తి కనబరుస్తున్నారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన డీఎస్సీ పరీక్ష ద్వారా వీరు నాన్ లోకల్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆంధ్రాలో ఉన్న పోటీలో నెగ్గడం కంటే.. తెలంగాణలోని జిల్లాల్లో నాన్ లోకల్ కేటగిరీలోనైనా జాబు సంపాదించుకోవచ్చని అప్పట్లో ఆలోచించారు. ఓ సారి ఉద్యోగం వచ్చాక.. బదిలీపై ఎప్పటికైనా సొంత రాష్ట్ర్రానికి వెళ్లొచ్చని భావించారు.        ఆంధ్రా నుంచి వచ్చినవారు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించారు. ఈ జిల్లాలో 140 మంది వరకూ ఆంధ్రా జిల్లాల వారు ఉన్నారు. ఆ తర్వాత మెదక్ లో 120 మంది, మహబూబ్ నగర్ జిల్లాలో 120 మంది వరకూ ఉన్నారు. హైదరాబాద్ శివారు జిల్లాలు కావడంతో ఈ జిల్లాలను అప్పట్లో ఎంచుకున్నారు. ఇప్పుడు తమకు ఆప్షన్ ఇచ్చి ఏపీ కేటగిరీలోకి మార్చాలని వారు కోరుతున్నారు. లేకపోతే జీవితాంతం తెలంగాణ ప్రాంతంలోనే పని చేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరి వీరి మొర రెండు రాష్ట్రాలు ఆలకించి పరిష్కారం చేస్తాయా..?

మరింత సమాచారం తెలుసుకోండి: