తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. భౌగోళికంగా వేరైనా ఈ మూడూ తెలుగు ప్రాంతాలే. కాకపోతే.. వందల ఏళ్లపాటు ఈ ప్రాంతాలను పాలించిన పాలకులు వేరు. ఆ కారణంగానే ఈ ప్రాంతాల్లోని పరిస్థితులు, సంస్కృతులు విభిన్నమయ్యాయి. తెలంగాణ నిజాంపాలనలో ఉంటే.. కోస్తా, సీమ తెల్లదొరల పాలనలో ఉన్నాయి. 

అటు తెల్లదొరలు.. ఇటు నిజాం.. ఇంచుమించు ఒకే సమయంలో అధికారం కోల్పోవడంతో.. తెలుగు ప్రాంతాలు అన్నీ కలసి ఉంటే బావుంటుందన్న ఆలోచనతో 1956లో ఆంధ్రప్రదేశ్ గా తెలుగు జాతి అంతా ఒక్కటైంది. వివక్ష, వెనుకబాటుతనం, ఆత్మగౌరవం, సంస్కృతి సంరక్షణ కారణాలతో మళ్లీ తెలంగాణ ఉద్యమం రెండు దఫాలుగా పుంజుకుని చివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడింది. 

తెలుగు నేల మళ్లీ ఒక్కటవుతుందా...?


ఐతే.. శతాబ్దాల తరబడి కలసి ఉన్న తెలుగుజాతి ప్రస్తుతం విడిపోయినా.. మళ్లీ భవిష్యత్తులో కలసిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగుజాతి చరిత్రలో అనేకసార్లు విడిపోయిందని , మళ్లీ కలిసింది అని ఆయన రాజమండ్రి పుష్కరాల సమయంలో కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలవడం పగటి కల అని తేల్చి చెప్పేస్తున్నారు. 

చంద్రబాబు పగటి కలలు కంటున్నారని హరీశ్ రావు కామెంట్ చేశారు. పగిలిన అద్దం, విరిగిన మనసులు కలవవని.. దీన్ని చంద్రబాబు గ్రహించాలని హరీశ్ అంటున్నారు. .చంద్రబాబు ప్రతి నిత్యం తెలంగాణకు ఎలా అడ్డుపడాలి, ఎలా పుల్లలు పెట్టాలని ఆలోచిస్తూ.. పైకి మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 9 ఏళ్లు పాలించిన చంద్రబాబు... మళ్లీ ఈ రెండు రాష్ట్రాలు ఏకమైతే.. మరోసారి ఉమ్మడి ఏపీని పాలించాలని కల కంటున్నారేమో అని గులాబీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: