పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనతో భూసేకరణ అంశం మరోసారి ఆంధ్రాలో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కల్యాణ్ పర్యటనపై అన్ని వర్గాలు ఆసక్తికనబరిచాయి. రాజధాని ప్రాంతంలో భూసేకరణను తెలుగుదేశం నాయకులు ఇన్నాళ్లూ సమర్థించుకుంటూ వచ్చారు. ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వని వారిని ప్రగతి నిరోధకులుగా చూపించే ప్రయత్నం చేశారు. 

వారిలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ఒకరు. ఒక మహాయజ్ఞం కోసం కొంత మందికి బాధ కలగడం సహజమే.. అన్నరీతిలో మురళీ మోహన్ కొన్నాళ్ల క్రితం కామెంట్ చేశారు. మరికొందరేమో.. చుట్టూ ఉన్న భూములు సేకరించి మధ్యలో ఉన్న భూములు ఎలా వదిలేస్తామంటున్నారు. ఇలాంటి వారందరికీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. 

ప్రత్యేకించి టీడీపీ ఎంపీ మురళీమోహన్ పేరు ప్రస్తావించి మరీ విమర్శించారు పవన్ కల్యాణ్.. ఈ సమయంలో ఆయనో ఆసక్తికరమైన వాస్తవం బయటపెట్టారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో మురళీ మోహన్ భూములను ప్రభుత్వం గుంజుకున్నప్పుడు.. ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లారట. ప్రభుత్వం తన భూములను అన్యాయంగా  తీసుకుంటోందని కోర్టుకు మొరపెట్టుకున్నారట. మరి వేల ఎకరాలు ఉన్న మురళీ మోహన్ కే తన భూమి ఒకటో, రెండో ఎకరాలు పోతేనే అంత బాధగా ఉంటే.. సాధారణ రైతు పరిస్థితి ఎలా ఉంటుందని పవన్ ప్రశ్నించారు. 

తన లాగానే రైతులు కూడా భూముల గురించి బాధపడతారని టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెలుసుకుంటే మంచిదని పవన్ సలహా ఇచ్చారు. అంతేకాదు. మురళీమోహన్ రాజధానిప్రాంతంలో పర్యటించి రైతుల బాధలను తెలుసుకోవాలని సూచించారు. మొత్తానికి పవన్ కల్యాణ్ పర్యటనతో మురళీ మోహన్ భూముల విషయం ప్రజలకు తెలిసింది. ఏదైనా తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదన్న నానుడిని మరోసారి గుర్తు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: