ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ కార్మికులు అచేపడుతున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయడానికి సైతం సిద్దమవుతుంది.పండగ సమయంలో సమ్మె చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సాయంత్రం 6గంటలలోగా ఆర్టీసీ కార్మికులందరూ విధులకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని...విధులకు హాజరుకాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం రాత్రి 11.10నిమిషాలకు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు త్రిసభ్య కమిటీ నివేదికను అందజేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై నిషేధం ఉందని....కావున ఇది చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. కార్మిక యూనియన్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 దసరా, బతుకమ్మ పండగ సమయంలో సమ్మె చేస్తే ఆర్టీసీకి వచ్చే  ఆదాయం రాకుండా పోతుందని అన్నారు.


 ఆర్టీసీ యూనియన్లు బాధ్యతా రహితంగా వ్యవహరించవద్దని పువ్వాడ అజయ్ హితవు పలికారు. శనివారం సాయంత్రం 6గంటలలోపు విధులకు హాజరుకాని ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నట్లేనని స్పష్టం చేశారు. యూనియన్ల ఉచ్చులో కార్మికులు, ఉద్యోగులు పడి బలికావొద్దని  వ్యాఖ్యానించారు.  విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.గతంలో 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, 16శాతం ఐఆర్‌ను కూడా ఇచ్చామని తెలిపారు. 


ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యూలరైజ్ చేశామని చెప్పుకొచ్చారు. డిపో మేనేజర్లకు శనివారం సాయంత్రం 6గంటలలోగా కార్మికులు, ఉద్యోగులు రిపోర్ట్ చేయాలని సూచించారు. శనివారం తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామని, వాహనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు రవాణా అధికారులు. ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: