ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్ హీరో బెన్‌​ స్టోక్స్‌ న్యాయపోరాటానికి దిగాడు. తమ కుటుంబంకు సంబంధించి బాధకరమైన, వ్యక్తిగత విషయాలను తమ ఆమోదం లేకుండా ప్రచురించిన ఆంగ్ల వార్తా దినపత్రిక 'ది సన్'పై చర్యలు తీసుకోవాలని స్టోక్స్‌ కోర్టును ఆశ్రయించాడు. బెన్‌​ స్టోక్స్‌తో పాటు అతని తల్లి కూడా స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ:

ఆంగ్ల వార్తా దినపత్రిక అయిన 'ది సన్' మొదటగా 'స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ' అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ జన్మించడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను ప్రచురించింది. బెన్ స్టోక్స్‌ సోదరి, సోదరుడుని అతడి తల్లి మాజీ ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు.

 

ఈ వార్తను మూడు దశాబ్దాల తర్వాత హైలెట్‌ చేస్తూ.. ది సన్ పత్రిక ప్రచురించింది. స్టోక్స్ కుటుంబానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని ప్రచురించడంపై స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జర్నలిజం పేరుతో ఇంత దిగజారతారా? అని ప్రశ్నించారు.

 

భార్యతో గొడవ:

తాజాగా మరో పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (పీసీఏ) అవార్డుల కార్యక్రమం ముగిశాక.. స్టోక్స్‌ తన భార్యతో గొడవపెట్టుకున్నాడని ఓ ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్టోక్స్‌ భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్టు ఫొటోతో సహా ప్రచురించింది. అయితే ఆ ఫోటోలో బెన్‌ స్టోక్స్‌ను క్లారే కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. ఆ మీడియా మాత్రం స్టోక్స్‌ను క్లారే కొట్టినట్లు ప్రచురించింది. ఈ విషయంపై స్టోక్స్‌ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

స్టోక్స్‌ అసహనం:

మీడియాలో వరుసగా తన గురించి కథనాలు రావడం పట్ల స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టోక్స్‌ న్యాయపోరాటానికి దిగాడు. మరోఆవైపు స్టోక్స్‌కు ఇంగ్లండ్‌ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. స్టోక్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలను వారందరూ విమర్శిస్తున్నారు. న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌కు న్యాయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: