తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు డిసెంబర్ నెల 25,26 తేదీలలో సూర్యగ్రహణం వలన రెండు రోజుల్లో కలిపి 13గంటల పాటు మూసివేయనున్నారు. సాధారణంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూస్తారు. సూర్యగ్రహణం డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున ఉదయం 8.08 గంటల నుండి 11.16 గంటల వరకు ఉంటుంది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు డిసెంబర్ 25వ తేదీ రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు డిసెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ తలుపులు తెరుస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆలయం తలుపులు తెరిచిన తరువాత ఆలయ శుద్ధి చేస్తారు. ఆలయ శుద్ధి తరువాత భక్తులకు సర్వదర్శనం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమవుతుంది. అధికారులు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. 
 
తిరుమలలో ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండాయి. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. టైం స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమల లడ్డు పెంపు గురించి వస్తున్న వార్తల గురించి కూడా ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి నుండి స్పష్టత వచ్చింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు టీటీడీ తీసుకోదని వై వి సుబ్బారెడ్డి గత వారం వెల్లడించారు. 
 
తిరుమలలోని అతిథి గృహాల అద్దె మాత్రం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో శ్రీవారి ఆలయం నిర్మించటానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందని వై వి సుబ్బారెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: