శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది.

 


అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు. బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథాపూర్వ స్థానానికే చేరుకుంటారు. 

 


అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలికాడట. విష్ణువు సత్యం పలుకుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు నిరసించడంతో, ఆ శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు.

 


శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడట. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలలవాడయ్యాడని, అనంతరం బ్రహ్మవిష్ణువులిద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ ఫలితాల కోసమే శివుడు లింగాకృతి దాల్చాడంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: