గాంధారి.. మహా భారతంలో ఈ పాత్రకు చాలా ప్రత్యేకత ఉంది. ఆమె దృతరాష్ట్రుడికి భార్య. అంధుడైన భర్తవలె కళ్ళు కనపడకుండా గంతలు కట్టుకుని జీవించింది. గాంధారి అంటే గాంధార ప్రాంతపు రాజపుత్రిక. ఈమె సోదరుడు శకుని. భీష్ముడు ఆ ప్రాంతం మీద దాడి చేసి పాలకుడు సుబలని వోడించి రాకుమారిని దృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేశాడు.

 

 

గాంధారికి ధుర్యోధనుడు సహా వంద మంది కుమారులు అన్న సంగతి తెలిసిందే. వారందరినీ మహాభారత యుద్ధంలో భీముడే చంపాడు. అయితే గాంధారికి ఈ విషయంలో భీముడిపై కన్నా శ్రీకృష్ణుడిపైనే కోపం ఎక్కువ. శ్రీకృష్ణుడి కారణంగానే మహా భారతయుద్ధం జరిగిందని.. కురువంశంలో ప్రముఖులంతా చనిపోయారని ఆమెకు చాలా కోపం.

 

 

అందుకే యుద్ధానంతరం భీముడిని తీసుకుని శ్రీకృష్ణుడు గాంధారి వద్దకు వచ్చినప్పుడు ఆమె కృష్ణుడిపై మండిపడింది. ‘కృష్ణా! ధార్తరాష్ట్రులూ, పాండవేయులూ కలహానికి కాలు దువ్వుతోంటే నువ్వు చూస్తూ వూరుకున్నావే కాని, వద్దని వారించలేకపోయావు. దుర్యోధనుని బంధు పుత్ర మిత్రాదులతో నిశ్శేషంగా నిర్మూలించాలనుకున్నావు. నిర్మూలించావు. అపార చతురంగ బలాలతో పాటు అనేక మంది రాజుల మృతికి కారకుడవై ఎలాగయితేనేం నీ లోలోపలి దుస్సంకల్పం నెరవేర్చుకున్నావు అంటూ ఆగ్రహించింది.

 

 

అంతే కాదు.. ఇందుకు తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి అంటూ శపించింది. "త్వరలోనే నువ్వది అనుభవిస్తావు. నేనే గనక మహాపతివ్రతనయి ఉంటే నా మాటలు వృధా కావు. నా శాపం ఫలించి తీరుతుంది. అన్నదమ్ముల బిడ్డల్లో అసూయలు కల్పించి, మాత్సర్యాలు రేపి ఎలాగయితే వారంతు చూశావో అలాగే నీ వంశంలో కూడా పరస్పరం వైరం చెలరేగి, ఒకరితో ఒకరు కలహించుకుని నశిస్తారు. నేటికి ముప్పయి ఆరో సంవత్సరంలో దిక్కూ మొక్కూ లేక నువ్వు కూడా మరణిస్తావు. అంటూ శపించింది గాంధారి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: