కరోనా మహమ్మారి కారణంగా సంపన్న ఆలయ ట్రస్టుల్లో ఒకటైన షిరిడీ సాయిబాబా ట్రస్టు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏటా రూ.400 కోట్ల ఆదాయం పొందే ఈ ప్రసిద్ధ ఆలయం.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా సమకూర్చుకోలేకపోతోంది. ప్రతినెలా 5వ తేది వరకు వచ్చే జీతాలు ఈ సారి 20 దాటినా రాలేదని షిరిడీ ఆలయ సిబ్బంది తెలిపారు. ట్రస్టును ఈ విషయమై సమాచారం అడిగినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నీటిని సరఫరా చేసే 32 మంది సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి జీతాలు చెల్లించలేదు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

 *రోజుకు రూ. 1.58 కోట్ల నష్టం* 

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే షిరిడీ సాయిబాబా ఆలయం.. కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ కారణంగా 90 రోజులుగా వెలవెలబోతోంది. సగటున రోజుకు 25 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు. పండుగ సందర్బాల్లో ఆ సంఖ్య దాదాపు లక్ష ఉండేది. లాక్​డౌన్​లో ఆలయానికి విరాళాలు కూడా అందడం లేదు. రోజుకు రూ.1.58 కోట్ల మేర నష్టపోతున్నట్లు అక్కడి ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ట్రస్టు వద్ద నిధులు లేవని పేర్కొన్నాయి.

గతంలో వచ్చిన విరాళాలను బ్యాంకులలో ఫిక్స్​డ్​ డిపాజిట్ల రూపంలో జమచేశారు. లాక్​డౌన్​ అమల్లోకి వచ్చాక ఆ డిపాజిట్ల నుంచే సిబ్బందికి జీతాలు చెల్లించారు. మే నెలకు వచ్చే సరికి ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

ఈ సంక్షోభ సమయంలో సాబబాబా సూపర్ స్పెషాలిటీలోని వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను నిలిపివేశారు. కాంట్రాక్టు సిబ్బంది వేతనాల్లో 40 శాతం కోత విధించారు. కొంతమందికి సెలవులు పెట్టుకోవాలని సూచించారు.

తమ సమస్యలను మేనేజింగ్​ కమిటీకి తెలియజేసినా మౌనమే సమాధానంగా వచ్చిందని ఆలయ ట్రస్టు ఉప కార్యనిర్వాహక అధికారి రవీంద్ర ఠాక్రే తెలిపారు. ఆలయాన్ని తెరిచాక భక్తుల తాకిడితో ప్రస్తుత ఆర్థిక నష్టాలు తీరిపోతాయని అధికారులు ఆశిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: