గాయత్రీ మంత్రం.. అనంత శక్తిని ప్రసాదించే మహిమాన్విత మంత్రి ఇది. జీవిత పురోగతిని కలిగించే శక్తిని అనుక్షణం అందిస్తుంది. శతాబ్దాల తరబడి కోట్ల మందితో ఇది పఠించబడుతూ వస్తోంది. గాయత్రీ మంత్రం జపించేందుకు వ్యక్తుల పరంగా ఎలాంటి నిబంధనలూ లేవు.  స్త్రీ పురుషులు, చిన్నలు పెద్దలు, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా పాటించవచ్చు. 

ఆ మంత్రాన్ని ఓసారి పఠించండి.. 

ఓం
భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ || ఓం ||

ఓం = ప్రణవ మంత్రంగాను; భూర్భువస్సువః = భూః, భువః, సువః అనే వ్యాహృతులుగాను ఉంటున్న; యః = ఎవరు; నః మన; ధియః = బుద్ధిని; ప్రచోదయాత్ = ప్రేరేపిస్తారో; సవితుః = సకలాన్ని సృష్టించే వాడిన; తత్ = ఆ; దైవస్య = దైవంయొక్క; వరేణ్యం = ప్రశస్తమైన; భర్గః = జ్యోతిర్మయ రూపాన్ని; ధీమహి = ధ్యానిద్దాం.

ప్రణవ మంత్రంగాను, భూః భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయరూపాన్ని ధ్యానిద్దాం!

ఈ మంత్రం మూడు భాగాలుగా ఉంటుంది. 

మొదటిది ప్రణవ మంత్రమైన ఓం

తర్వాత వచ్చే భాగం ప్రణవమంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి దివ్యశక్తి కలిగిన పదాలు. స్థూలస్థితిలో ఇవి భూమి (భూః) పితృలోకం (భువః), దేవలోకం (సువః) అనే 
మూడు లోకాలను సూచిస్తాయి. సూక్ష్మస్థితిలో మన చేతనా యొక్క మూడు స్థితులను, అంటే శరీరం, మనస్సు, ప్రాణం అనే మూడు స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని 
పరిపోషణ గావిస్తాయి.

తత్….ప్రచోదయాత్ అనే భాగం సావిత్రీమంత్రంగా పెర్కొబడుతున్నది. ప్రణవం, వ్యాహృతి, సావిత్రీ – ఈ మూడు కలిసిందే గాయత్రీ.



మరింత సమాచారం తెలుసుకోండి: