ఒక పని నిర్విఘ్నంగా జరగాలంటే ముందు కావల్సింది ఏంటి.. నమ్మకం.. ఆ పని తప్పకుండా జరుగుతుందన్న నమ్మకం మనకు ఉంటే.. ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. అనేక సందేహాలతో విజయంవైపు సాగిపోవాలంటే అది కష్టమే. ఈ విషయం ఇంకా మనకు అర్థం కావాలంటే ఓ కథ రూపంలో తెలుసుకుందాం.. 

ఒక అడవి లో ఒక నిండు గర్భిణి అయిన లేడికి నొప్పులు వస్తున్నాయి . ప్రసవం కోసం అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఓ నది పక్కన దట్టమైన గడ్డి భూమి కనబడింది.  అక్కడ పడుకుని ప్రసవ వేదన పడుతోందా లేడి. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు పడుతున్నాయి. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. 

ఇంతలో లేడిని చూసిన ఓ సింహం దాని వైపు రాసాగింది. మరోవైపు నుంచి ఒక వేటగాడు లేడిపై బాణం సంధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పారిపోదామంటే పక్కనే నది. ఓ వైపు వేటగాడు, మరోవైపు సింహం, మరోవైపు అగ్ని, పైనుంచి వర్షం, ఉరుములు పిడుగులు.. ఈ సమయంలో లేడి ఏంచేయాలి.. ఏమి జరగబోతోంది ?లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా?

ఇవన్నీ చూసినా లేడీ నిబ్బరంగా ధైర్యం తెచ్చుకుంది. ఏదైతే అదే అయ్యిందని ప్రసవంపైనే దృష్టి సారించింది. అప్పుడే కొన్ని అద్బుతాలు జరిగాయి. పిడుగు కాంతికి బాణం సంధిస్తున్న వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పిన బాణం ఎదురుగా లేడిని తినేందుకు వస్తున్న సింహానికి తగిలింది. సింహం మరణించింది. వర్షధారలకు మంటలు ఆరిపోయాయి. 

లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.. ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అది అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది?? మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగిటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసింది. ఏమంటారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: