తెలంగాణ ప్రజలకు పండుగల నెలలంటే  సెప్టెంబరు, అక్టోబరు మాసాలే. ఈ రెండు నెలల్లో  రెండు పెద్ద పండుగలను  జరుపుకుంటారు. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోతాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొక పండుగ దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను శనివారం నుంచి అక్టోబర్ ఆరు వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది.


శనివారం వరంగల్ అర్బన్ జిల్లాకేంద్రంలోని హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతారు. అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అన్ని గ్రామపంచాయతీల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతారు. 4న అన్ని అర్బన్ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌లో భారీఎత్తున ఉత్సవాలు జరుపుతారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కూడా పండుగకు ఏర్పాట్లుచేస్తున్నారు.




రవీంద్రభారతిలో శనివారం నుంచి అక్టోబర్ 6 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ఉంటుంది. అక్టోబర్ ఆరున ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుక జరుపుతారు. సుమారు పదివేల మంది మహిళలు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వరకు చేరుకుంటారు. ఈ సందర్భంగా జానపద కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు, ఆడపడుచులకు మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ పండుగ శుభా కాంక్షలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: