భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఘనంగా మొదలైన డే / నైట్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. మ్యాచ్‌ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 30.3 ఓవర్లలోనే 106 పరుగులకి మొదటి ఇన్నింగ్స్‌లో ప్యాక్ అప్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి 46 ఓవర్లలో 174/3తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లి ( 59 బ్యాటింగ్: 93 బంతుల్లో 8x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (23 బ్యాటింగ్: 22 బంతుల్లో 3x4) ఉండగా భారత్ ఇప్పటికే 68 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

 

ఇండోర్ టెస్టు తరహాలోనే ఈడెన్‌ గార్డెన్స్‌ లోనూ భారత ఫాస్ట్ బౌలర్లు చెలరేగగారు. ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), మహ్మద్ షమీ (2/36) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుసగా వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ లు కనీసం క్రీజులో కూడా నిలవలేకపోయారు. అది ఎంతలా అంటే..? ఆ జట్టులో ఏకంగా నలుగురు బ్యాట్స్‌ మెన్‌ లు డకౌటవగా, మొత్తంగా 9 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌ కే పరిమితమయ్యారు. ఓపెనర్ ఇస్లామ్ (29: 52 బంతుల్లో 5x4), లిట్టన్ దాస్ (24 రిటైర్డ్ హర్ట్: 27 బంతుల్లో 5x4) మాత్రమే పర్వాలేదనిపించారు.

 


బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (14: 21 బంతుల్లో 3x4), రోహిత్ శర్మ (21: 35 బంతుల్లో 2x4, 1x6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, అనంతరం వచ్చిన చటేశ్వర్ పుజారా (55: 105 బంతుల్లో 8x4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ ని చక్కదిద్దిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత పుజారా ఔటవగా, రహానెతో కలిసి కోహ్లీ ఆఖరి సెషన్‌ లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. గులాబీ రంగు బంతితో డే / నైట్ టెస్టు మ్యాచ్ ఆడుతుండటం ఈ రెండు జట్లకీ ఇదే మొదటిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: