భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆఖరి సమరానికి చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌ని ఇప్పటికే 2-1తో గెలిచిన టీమిండియా, వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. చెపాక్‌ లో జరిగిన తొలి వన్డేలో పరాజయాన్ని ఎదురుకొన్న కోహ్లీసేన, ఆ తర్వాత వైజాగ్ వన్డేలో 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని గెలిచి సిరీస్‌ని 1-1 తో సమం చేయగలిగింది. దీనితో విజేత నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, ఆదివారం మధ్యాహ్నం 1.30 కి కటక్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

ఇక భారత టీంలో చూస్తే జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలతో మళ్లీ ఫామ్ లోకి రాగ ఇప్పుడు టీమిండియా బెంగ అంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే. భారీ అంచనాల మధ్య చెపాక్, వైజాగ్ వన్డేలో ఆడిన కోహ్లీ వరుసగా తక్కువ పరుగులకే పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దీనితో కనీసం ఆఖరి వన్డేలోనైనా అతను బ్యాట్ కు పనిచెప్పాలని భారత్ ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్‌ లో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతుండగా, రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం కాస్త చెప్పుకోతగ్గ విషయం. ఇక బౌలింగ్‌లోనూ మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు మంచి ఊపు మీద ఉన్నారు. అయితే రవీంద్ర జడేజా మాత్రం ధారాళంగా పరుగులిచ్చేస్తూ జట్టులో ఆందోళన పెంచుతున్నాడు. ఇక గాయపడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నవదీప్ షైనీకి తుది జట్టులో అవకాశమిస్తారా, లేదా అనేది వేచి చూడాలి. శార్ధూల్ ఠాకూర్, కేదార్ జాదవ్‌ లో ఒకరిపై వేటు వేసి చాహల్‌ ని తీసుకోవాలనే ఆలోచనలోనూ టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం.

 

ఇక వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లావిస్ దూకుడుగా ఆడుతుండగా, సిమ్రాన్ హిట్‌మెయర్, నికోలస్ పూరన్ మిడిల్ ఓవర్లలో ఆ జోరుని అలాగే కొనసాగిస్తున్నారు. ఇక కెప్టెన్ కీరన్ పొలార్డ్, జేసన్ హోల్డర్ కూడా బ్యాటింగ్‌ లో కాస్త నిలకడగా రాణిస్తుండటం ఆ జట్టుకి బాగా కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో కాట్రెల్, అల్జారీ జోసఫ్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తుండగా, రోస్టన్ ఛేజ్, కీమోపాల్ వైజాగ్ వన్డేలో రోహిత్, రాహుల్, శ్రేయాస్ దెబ్బకి చేతులు ఎత్తేసారు. దీనితో ఆఖరి వన్డేలోనైనా గెలిచి సిరీస్ విజయంతో పరువు నిలుపుకోవాలని కరీబియన్లు భావిస్తున్నారు. వెస్టిండీస్‌ గత దశాబ్దకాలంలో భారత్ గడ్డపై ఒక్క వన్డే సిరీస్ కూడా గెలచులేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: