దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి నెలలో  అండర్‌-19 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో భారత యువ క్రికెటర్లకు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు.  తిరిగి వరల్డ్‌కప్‌తో  రావాలని ఆకాంక్షించాడు.

 

ఆ టోర్నీలో అదే సమయంలో  యువ ఆటగాళ్లకు తమ సహజ సిద్ధమైన ఆటతో ఆడే స్వేచ్ఛ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు విన్నవించాడు. మేనేజ్‌మెంట్‌ వారిపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసుకోవడం  తమ విధిగా గుర్తించాలన్నాడు. మనోళ్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తే వరల్డ్‌కప్‌ను సగర్వంగా తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా ప్రియాంక్‌ గార్గ్‌ నేతృత్వంలోని యువ జట్టుకు ముందుగా అభినందనలు తెలిపాడు. 

 

‘కవర్‌ డ్రైవర్‌లతో పాటు భారీ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.నిజానికి గాల్లోకి షాట్లను ఆడటం క్రైమ్‌ కాదు అనే విషయం గ్రహించాలి. ఒకవేళ భారీ షాట్లు ఆడే క్రమంలో ఆటగాళ్లు ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేయండి.. అంతేకానీ వారి సహజసిద్ధమైన షాట్లను ఆడొద్దని నివారించకండి. మనం క్రికెట్‌ ఆటలో  గాల్లో షాట్లను కొడుతూనే పెరిగాం. భారీ షాట్లు ఆడేటప్పుడు అవి సరైనవి కాకపోతే వాటిని నెట్స్‌లో సరి చేసుకున్నాం.. ఫలితాలు రాబట్టాం.

 

ఒక ఆటగాడు భారీ షాట్లతో ఫలితాలు రాబడుతున్నప్పుడు అప్పుడు అందులో తప్పేముంటుంది. ప్రస్తుత జనరేషన్‌లో షాట్లు ఆడాలనుకుంటున్న వారే ఎక్కువ. కాకపోతే గేమ్‌ స్థితి గతుల్ని బట్టి బ్యాటింగ్‌ను మార్చుకోవడం చాలా ముఖ్యమైనది.  ఒకవేళ ఒక క్రికెటర్‌ పదే పదే ఒకే తరహా తప్పిదం చేస్తుంటే వారిని తదుపరి గేమ్‌కు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి అని తెలిపారు . నా దృష్టిలో షాట్లు ఆడటం క్రైమ్‌ కాదు’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. జనవరి 17వ తేదీ నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. కాగా, గ్రూప్‌-ఏలో ఉన్న భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో జనవరి 19వ తేదీన ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: