తెలుగుతేజం, చెస్‌ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరోసారి అంతర్జాతీయంగా సత్తా చాటింది. చదరంగంలో హారికా..జోహారికా.. అని అంతా మెచ్చుకునే రేంజ్ లో విజయం సాధించింది. తన క్రీడా జీవితం మొత్తంలోనే చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

చైనాలోని చెంగ్డులో జరిగిన ఫిడె మహిళల గ్రాండ్‌ పి విజేతగా మన ద్రోణవల్లి హారిక నిలిచింది. ద్రోణవల్లి హారికకు ఇదే తొలి ఫిడే గ్రాండ్‌ పి టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో మొత్తం 12 మంది క్రీడాకారిణులు పోటీపడ్డారు. విచిత్రం ఏంటంటే.. ఈ పోటీ మొత్తంలో ఇద్దరు తెలుగమ్మాయిల మధ్యే పోటీ జరగడం విశేషం. 


ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మధ్యే మొదటి నుంచీ పోటీ నడిచింది. చివరి రౌండ్‌లో హారిక రష్యా గ్రాండ్‌ మాస్టర్‌ ఓల్గా గిర్యాతో పోటీపడింది. ఆ ఆటను డ్రాగా ముగించి మొత్తం 7 పాయింట్లు సాధించింది హారిక. మరోవైపు హంపి కూడా 7 పాయింట్లతో సమాన స్థాయిలో నిలిచింది. తెలుగమ్మాయిలిద్దరూ టైటిల్ కోసం హోరాహోరీ పోరాడారన్నమాట. 

ఈ సమయంలో ట్రైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయించారు. మెరుగైన టై బ్రేక్‌ స్కోర్‌ ఉన్న హారికను టైటిల్‌ వరించింది. మన తెలుగమ్మాయి హంపి రెండోస్థానంలో నిలిచింది. ఏదేమైనా ప్రపంచ ఫిడె గ్రాండ్ పి విజేతలుగా మొదటి, రెండు స్థానాల్లో మన తెలుగమ్మాయిలే గెలుచుకోవడం విశేషమేగా.. హారిక ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఏపీ హెరాల్డ్  ఆకాంక్షిస్తోంది.. కంగ్రాట్స్ హారికా.. నీకే జోహారిక.



మరింత సమాచారం తెలుసుకోండి: