ప్రపంచంలో క్రికెట్ అంటే ఎంత ప్రాదాన్యత ఇస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  అయితే క్రికెట్ మైదానంలోకి వెళితే ఎవరికి వారే తమ స్కోరు పెంచుకోవాలనో..వికెట్స్ పడగొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంటారు.  కొన్ని సార్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంటారు..మరికొన్ని సార్లు చెత్త రికార్డు నమోదు చేస్తుంటారు.

తాజాగా  లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. ఒమన్‌ క్రికెట్ జట్టు మూడు పదుల స్కోరు కూడా చేయకుండానే కుప్పకూలడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.  స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్‌ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఘోరమైన విషయం ఏంటంటే..ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్‌ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాకపోతే ఒక్క ఖవర్‌ అలీ(15) మాత్రం రెండంకెల స్కోరు చేశాడు. 

కాగా, స్కాట్లాండ్‌ బౌలర్లలో రుద్రి స్మిత్‌, ఆడ్రియన్‌ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లతో ఒమన్‌ జట్టుపై పట్టు సాధించారు.  అయితే లిస్ట్‌-ఎ క్రికెట్‌లో నాల్గో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్‌ పేరిట ఉంది. తాజా మ్యాచ్‌లో 25 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్‌ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: