వరల్డ్ కప్ సాధించాలనేది క్రికెట్ ఆడే ఏ జట్టు కలైనా. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోరులో పాల్గొనే జట్లన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకుని బరిలోకి దిగుతాయి. హోరా హోరీ మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. విషయమేమిటంటే.. ఈ వరల్డ్ కప్ (2019) మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ఆట తీరు.. అచ్చంగా 27 ఏళ్ల క్రితం 1992 వరల్డ్ కప్ లో ఆజట్టు ఆట తీరునే పోలివుండటం. ఈ పరిణామాలతో క్రీడాకారులు, క్రీడా పండితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేంటో చూడండి..

 

 

ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆట తీరు.. ఓ మ్యాచ్ ఓడుతుంది.. మరో మ్యాచ్ గెలుస్తుంది. సెమీస్ కి కష్టం అనుకుంటుంటే ఠక్కున ఓ మ్యాచ్ గెలిచి నేనూ ఉన్నానంటుంది. భారత్ తో ఓటమి తరువాత విమర్శలపాలైన ఆజట్టు న్యూజిలాండ్ ను ఓడించి ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 1992లో ఆ జట్టు కెప్టెన్. ఆయన సారధ్యంలో ఆ జట్టుకు మొదటి ఏడు మ్యాచ్ ల్లో ఎదురైన పరిస్థితులే ప్రస్తుతం సర్ఫరాజ్ కెప్టెన్సీలోనూ జరుగుతోంది. 1992లో పాక్.. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓటమి, రెండో మ్యాచ్ లో జింబాబ్వే పై గెలుపు, మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దు, నాలుగు.. ఐదు మ్యాచ్ ల్లో ఓటమి, ఆరు.. ఏడు మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించింది. అదే జోరులో సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించి, ఫైనల్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి వరల్డ్ కప్ ను ముద్దాడింది. 2019లో.. సరిగ్గా అదే లైనప్ జరుగుతోంది. మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ తో ఓటమి, రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలుపు, మూడో మ్యాచ్ వర్షంతో రద్దు, నాలుగు.. ఐదో మ్యాచ్ లు ఓటమి, ఆరు.. ఏడు మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ లైనప్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయింది.

 

 

దీంతో ఇప్పుడు అందరి దృష్టి పాకిస్థాన్ పై పడింది. 1992 నాటి మ్యాజిక్ కంటిన్యూ అయితే 2019 వరల్డ్ కప్ విజేత పాకిస్థానే కానుందా.. అని క్రీడా పండితులు, క్రికెట్ అభిమానులు విశ్లేషిస్తున్నారు. మరి.. ఆ మ్యాజిక్ ని పాక్ ఈ ఏడు మ్యాచ్ లకే పరిమితం చేస్తుందా లేదా కంటిన్యూ చేసి కప్ ను ముద్దాడుతుందా అనేది.. మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: