అంబటి రాయుడు.. తెలుగు నేల నుంచి క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడటం చాలా తక్కువ. వెంకటపతిరాజు, వెంకటేశ్ ప్రసాద్ వంటి కొందరు మాత్రమే ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఆ తర్వాత అంబటి రాయుడు ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడని అంతా ఆశించారు.


కానీ ఎంతో భవిష్యత్ ఉన్న అంబటి రాయుడు.. సెలక్టర్ల తీరుపై అసంతృప్తితో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇందులో సెలెక్టర్ల పక్షపాత ధోరణి, సంకుచితత్వం విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అదే సమయంలో రాయుడు చేసిన కొన్ని తప్పులు కూడా ఆయన పాలిట శాపంగా మారాయి.


ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో చోటు లభించినా... ఫిట్‌నెస్ తేల్చడానికి జరిపే ‘యోయో టెస్ట్’లో రాయుడు ఫెయిలై జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిట్‌నెస్ విషయం నిర్లక్ష్యం చేసి ఆ సువర్ణావకాశం పోగొట్టుకున్నాడు. గత నవంబర్లో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం మరో పొరపాటు.


తనను పక్కన పెట్టి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ప్రపంచకప్ జట్టులో చేర్చడం గురించి ట్విట్టర్‌లో రాయుడు పెట్టిన వెటకారపు కామెంట్ అన్నిటికన్నా పెద్ద తప్పు.విజయ్ శంకర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కూడా రాణించగల 3డీ ప్లేయర్ అన్న ఎమెస్కే ప్రసాద్ వ్యాఖ్యను రాయుడు తప్పుబట్టాడు. అందుకు వెటకారంగా ఈసారి ప్రపంచ కప్ చూడడానికి నేను 3డీ కళ్ళద్దాలు కొనుక్కుంటాను అంటూ ట్వీట్ చేశాడు.


బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్ళు సెలెక్షన్ నిర్ణయాలు తమకు నచ్చకపోయినా బహిరంగంగా తప్పు బట్టడం రూల్స్ కు విరుద్దం. గతంలో వీవీఎస్ లక్ష్మణ్‌, రోహిత్ శర్మ దినేశ్ కార్తిక్‌ వంటి వారు కూడా ఎన్నోసార్లు సెలక్టర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇలా ధిక్కారం ప్రదర్శించలేదు. ఈ పొరపాట్లే రాయుడి కొంప ముంచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: