భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి టీమిండియా కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ అండగా నిలిచాడు. వన్డే, టీ20ల్లో అగ్రశ్రేణి ఓపెనర్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మకి టెస్టుల్లో కనీసం చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విక్రమ్.. ఇకపై టెస్టుల్లోనూ ఓపెనర్‌గా రోహిత్‌ని ఆడించబోతున్నట్లు స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో అక్టోబరు 2 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇటీవల జట్టుని ప్రకటించిన సెలక్టర్లు రోహిత్ శర్మ‌‌ని ఓపెనర్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఇప్పటి వరకూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

భారత బ్యాటింగ్ కోచ్‌గా ఇటీవల నియమితుడైన విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ ‘వన్డే, టీ20ల్లో తిరుగులేని ఓపెనర్‌గా ఉన్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో ఎందుకు ఓపెనర్‌గా రాణించలేడు..? అందుకే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పిస్తాం. రోహిత్ చాలా అద్భుతమైన ఆటగాడు. టెస్టుల్లో అతను ఓపెనర్‌గా రాణిస్తే..? టీమ్‌కి అదనపు బలం చేకూరుతుంది’ అని వెల్లడించాడు.

కెరీర్‌లో ఇప్పటి వరకూ 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 48.53 సగటుతో 8,686 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 27 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. కానీ.. 27 టెస్టులు ఆడిన రోహిత్ 39.62 సగటుతో చేసిన పరుగులు 1,585 మాత్రమే. ఇందులో మూడు శతకాలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య గత ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. బుధవారం రాత్రి మొహాలి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఆదివారం బెంగళూరులో మూడో టీ20 ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: